అయోవా పేలుడు తర్వాత తగ్గని ఆందోళన
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని మిడిల్‌టౌన్ సమీపంలో నియంత్రిత పేలుడు నిర్వహించిన తర్వాత కూడా స్థానిక ప్రజల్లో ఆందోళన, అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. లెడ్ అజైడ్ నిల్వల పేలుడు వల్ల ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయ భూములు, తాగునీటి వనరులపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయో స్పష్టమైన సమాధానాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. చలి తీవ్రత పెరిగేకొద్దీ నిల్వ ఉన్న పేలుడు పదార్థాలు అప్రయత్నంగా పేలే ప్రమాదం ఉందనే కారణంతో అమెరికా సైన్యం ఈ నియంత్రిత పేలుడును నిర్వహించింది. పేలుడు కారణంగా విషపూరిత సీసం దుమ్ము మేఘం దాదాపు 100 మైళ్ల దూరం వరకు వ్యాపించే అవకాశం ఉందని ముందస్తు అంచనాలు వెలువడటంతో సమీప ప్రాంతాల ప్రజలు ముందుగానే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
పేలుడుకు ముందు, ఆ తర్వాత అనేక మంది నివాసితులు ఇళ్లను వదిలి వెళ్లడం, కిటికీలు, తలుపులను మూసివేయడం, బయటి ప్రాంతాలను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. పర్యావరణ సంస్థలు ఈ అనుమతులపై న్యాయస్థానాలను ఆశ్రయించగా, అప్పీళ్ల కోర్టు అభ్యంతరాలను తిరస్కరించడంతో పేలుడు ప్రక్రియ ముందుకు సాగింది. అయితే, పేలుడు అనంతరం సురక్షితమని అధికారికంగా పూర్తి స్థాయి నిర్ధారణ రాకపోవడం, సమాచార స్పష్టత లోపించడంపై స్థానికులు, సమీప నగరాల ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మిస్సిస్సిప్పి నది వంటి నీటి వనరుల నుంచి తాగునీరు తీసుకునే నగరాల అధికారులు, పర్యావరణ ప్రభావాలను నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.
మరోవైపు, ఈ ఘటనతో నష్టపోయిన రైతులు, కుటుంబాలకు పరిహారం కోరే అంశంపై న్యాయపరమైన అవకాశాలను న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలపై దావాలు వేయడం, పరిహారం క్లెయిమ్‌లు దాఖలు చేయడం వంటి ప్రక్రియలకు స్పష్టమైన ఆధారాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్ల ఖర్చులు, శుభ్రపరిచే సామాగ్రి, పరీక్షల రసీదులు భద్రపరుచుకోవడంతో పాటు ఆస్తిపై పడిన దుమ్ము ఫొటోలు తీయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు అందుతున్నాయి. పేలుడు ప్రభావంపై పూర్తిస్థాయి పరీక్షల నివేదికలు, తదుపరి చర్యల కోసం ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.