గాలి కాలుష్యం నుంచి ఎయిర్ ప్యూరిఫైయర్లు నిజంగా రక్షణ ఇస్తాయా.. కొనుగోలుకు ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
సూర్య లైఫ్ డెస్క్: ప్రస్తుత కాలంలో నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతోంది. ఇళ్ల బయటే కాకుండా ఇంట్లోకి కూడా సూక్ష్మ కాలుష్య కారకాలు ప్రవేశిస్తుండటంతో చాలా మంది ఎయిర్ ప్యూరిఫైయర్ల కొనుగోలుపై మొగ్గు చూపుతున్నారు. అయితే గాలి కాలుష్యం బారి నుంచి ఈ పరికరాలు నిజంగానే పూర్తి రక్షణ కల్పిస్తాయా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. మార్కెట్లో లభించే వివిధ రకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇండోర్ గాలిలోని దుమ్ము, ధూళి కణాలు, హానికర సూక్ష్మ కాలుష్యాలను కొంతవరకు తొలగించడంలో సహాయపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సరైన మోడల్‌ను ఎంచుకోవడంలో కొన్ని ప్రత్యేక సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా పరికరంలో ట్రూ హెపా ఫిల్టర్ అమర్చబడి ఉందా లేదా అనేది పరిశీలించడం మొదటి ప్రాధాన్యత కావాలి. ఈ ఫిల్టర్లు గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన పీఎం 2.5 కణాలు, దుమ్ము పుప్పొడి రేణువులను సమర్థవంతంగా బంధించి గాలిని శుద్ధి చేస్తాయి. కేవలం సాధారణ ఫిల్టర్లు లేదా తక్కువ నాణ్యత గల పరికరాలను ఎంచుకోవడం వల్ల ఆశించిన ఫలితం ఉండకపోగా డబ్బు వృధా అయ్యే అవకాశం ఉంది.
దీంతో పాటు క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ అనబడే సీఏడీఆర్ సామర్థ్యాన్ని, గది విస్తీర్ణానికి సరిపోయే కవరేజ్ ఏరిటెను పరిశీలించి కొనుగోలు చేయాలి. చిన్న గదులకు తక్కువ సామర్థ్యం సరిపోతుంది కానీ పెద్ద హాల్స్ లేదా విశాలమైన ప్రదేశాల కోసం ఎక్కువ సీఏడీఆర్ రేటింగ్ ఉన్న పరికరాలు అవసరమవుతాయి. అలాగే యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు ఉన్న మోడల్స్ ఇళ్లలోని దుర్వాసనలను, హానికరమైన వాయువులను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి.
పరికరాలు కొనుగోలు చేసే ముందు వాటి శబ్దం స్థాయిలు, విద్యుత్ వినియోగం అలాగే నిర్వహణ ఖర్చులను బేరీజు వేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఫిల్టర్లు త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పుడు మార్చాలనే దానిపై స్పష్టత ఉండాలి. కేవలం ఆకర్షణీయమైన ఫీచర్లు లేదా ప్రకటనలను చూసి మోసపోకుండా నాణ్యతా ప్రమాణాలు కలిగిన ధృవీకృత ఎయిర్ ప్యూరిఫైయర్లను ఎంచుకోవడం ద్వారా మాత్రమే ఇంటిలోని వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.
Also Read: సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబు!