సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబు!
- నవంబర్ 12, 13 తేదీల్లో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు
- దేశ, విదేశీ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్
- నగర సుందరీకరణ, పారిశుధ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి
- 9 నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు: కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, సూర్య: అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం ముస్తాబవుతోంది. ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. దేశ, విదేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్‌తో కలిసి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సదస్సు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సదస్సు నిర్వహణలో ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని రావత్ స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అతిథుల వసతి, రవాణా, భద్రత, ప్రోటోకాల్, రిజిస్ట్రేషన్, పాసుల జారీ తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. లైజన్ అధికారులు తమకు కేటాయించిన అతిథుల అవసరాలు, కార్యక్రమాల వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో నగర సుందరీకరణ, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రావత్ ఆదేశించారు. నగరవ్యాప్తంగా సదస్సు ప్రచారం, బ్రాండింగ్ చేపట్టాలన్నారు. ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాల్లో స్వాగత బోర్డులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు వేదికల నిర్మాణ భద్రత, అగ్నిమాపక వ్యవస్థ, విద్యుత్ సరఫరా, ప్రజా సమాచార వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
విశాఖ విమానాశ్రయంలో ప్రత్యేక స్వాగత కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా అతిథులకు స్వాగతం పలకాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లు రూపొందించి గైడ్లను అందుబాటులో ఉంచాలన్నారు. హాప్-ఆన్ హాప్-ఆఫ్ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రధాన వేదిక ఎదురుగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, మొబైల్ మరుగుదొడ్ల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
- 9 నుంచి కంట్రోల్ రూమ్
జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ సదస్సు నిర్వహణ కోసం నవంబర్ 9 నుంచి ప్రత్యేక కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్, పాసుల జారీ ప్రక్రియను కలెక్టరేట్ నుంచి పర్యవేక్షిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీఈడీబీ సీఈఓ సాన్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్, ఎండీ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు