బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సీరియస్.. కంటెస్టెంట్లకు రెడ్ అండ్ ఎల్లో కార్డుల మోత!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు పదవ సీజన్ నాలుగో వారం ముగింపునకు చేరుకునేసరికి మరింత హాట్‌హాట్‌గా మారుతోంది. గత వారం మిథిలేష్ పదిహేను లక్షల రూపాయల ప్రైజ్ మనీ తీసుకుని హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడంతో ఎలిమినేషన్ జరగలేదు. కానీ ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో మాత్రం హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరుపై తీవ్రంగా స్పందిస్తూ క్లాస్ పీకారు. హౌస్‌లో కంటెస్టెంట్లు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా ఎత్తిచూపుతూ వారి ప్రవర్తనను తప్పుపట్టారు. ముఖ్యంగా నిబంధనలను అతిక్రమించిన వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎల్లో, రెడ్ కార్డ్స్ ప్రదర్శించి ఇంటి సభ్యులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఈ వారంలో కెప్టెన్‌గా వ్యవహరించిన అపూర్వ పనితీరుపై నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమెను డిజాస్టర్ కెప్టెన్‌గా అభివర్ణించారు. ఆ తర్వాత కంటెస్టెంట్ ఆటో రామ్‌ప్రసాద్ తీరును తప్పుపట్టూ నామినేషన్ల నిబంధనలను ఉల్లంఘించినందుకు మందలించారు. ఇక మరో కంటెస్టెంట్ షాలిని వాడిన బూతు మాటలను తీవ్రంగా ఖండించిన నాగ్, ఆడియన్స్ చూస్తున్నారనే విషయాన్ని మరువద్దని హెచ్చరించారు. అమన్, త్రిగుణ్‌ల ఆటతీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన హోస్ట్, వారిద్దరికీ ఎల్లో కార్డ్స్ ప్రదర్శించి ఇదే చివరి వార్నింగ్ అని హెచ్చరించారు. చిన్న చిన్న పొరపాట్లను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, హౌస్‌మేట్ రోహిత్ వ్యవహరించిన తీరు ఎపిసోడ్‌లోనే అత్యంత వివాదాస్పదంగా మారింది. చరణ్‌తో మాట్లాడుతున్న సమయంలో రోహిత్ మాట్లాడిన బూతులు, బిగ్‌బాస్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను నాగార్జున ప్రదర్శించారు. ఆ తర్వాత డ్రమ్‌ను తన్నేయడం వంటి హింసాత్మక చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటి తలుపులు తెరిపించి బయటకు వెళ్ళిపోవాలని హెచ్చరించారు. రోహిత్ క్షమాపణలు కోరినప్పటికీ, ఆటలో ఉన్మాదం ప్రదర్శించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నాగ్ స్పష్టం చేశారు. మొత్తానికి ఈ వీకెండ్ ఎపిసోడ్ కంటెస్టెంట్లకు చెమటలు పట్టించడంతో పాటు ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచింది.