బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హిందీ టెలివిజన్ రంగంలో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 20 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో షో హోస్ట్ సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు మనోజ్ తివారీ కూతురు రితి తివారీ ప్రవర్తన మరియు ఆమె ప్రదర్శించిన అహంభావంపై సల్మాన్ ఖాన్ నేరుగా నిలదీశారు. గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా సాగిన రాప్ డిస్ బ్యాటిల్‌లో తోటి హౌస్‌మేట్స్‌పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం, బూతులు మాట్లాడటం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
ఉదితి సింగ్ మరియు ఖాజీ తౌకీర్‌లతో జరిగిన వాగ్వాదంలో రితి తివారీ హద్దులు మీరి ప్రవర్తించడమే కాకుండా, తన తండ్రి బయట చూసుకుంటారంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటంపై సల్మాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె మాటలను కేవలం రాప్ గేమ్‌లోని పదాలుగా సమర్థించుకోవడానికి ప్రయత్నించగా, సల్మాన్ దానిని గట్టిగా తిప్పికొట్టారు. ఖాజీ పాపులారిటీని చూసి ఆమెలో అసూయ పెరిగిందని, అందుకే వ్యక్తిగత విమర్శలకు దిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. హౌస్‌లోకి రాకముందు ఎవరికీ పరిచయం లేని రితికి, కేవలం తన తండ్రి ప్రముఖ వ్యక్తి కావడం వలనే ఈ గుర్తింపు దక్కిందని సల్మాన్ ముఖం మీదనే స్పష్టం చేశారు.
కుటుంబ నేపథ్యం మరియు సెలబ్రిటీల పిల్లలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంపై బిగ్ బాస్ వేదికగా మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సొంత ప్రతిభతో నిలదొక్కుకోవడం వేరు, సెలబ్రిటీ వారసత్వంతో లభించే ప్రయోజనాలు వేరు అని సల్మాన్ హౌస్‌మేట్స్‌కు హితవు పలికారు. తోటి కంటెస్టెంట్లను కించపరిచే విధంగా మాట్లాడటం ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. ఈ ఎపిసోడ్‌తో షోలో వాతావరణం పూర్తిగా వేడెక్కగా, రితి తివారీ తీరుపై బయట కూడా ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేక్త వ్యక్తమవుతోంది. బిగ్ బాస్ లాంటి పెద్ద వేదికలపై నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో హెచ్చరించారు.