బిగ్ బాస్ తెలుగు 10 వేదికపై రష్మిక మందన్నకు ఊహించని సర్‌ప్రైజ్.. కాలేజీ సీనియర్ ముఖేష్ గౌడతో ఆసక్తికర ముచ్చట
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బిగ్ బాస్ తెలుగు 10 వీకెండ్ ఎపిసోడ్‌లో సందడి చేశారు. హోస్ట్ నాగార్జున సమక్షంలో జరిగిన ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను పలకరిస్తున్న సమయంలో రష్మికకు అనూహ్యమైన సర్‌ప్రైజ్ ఎదురైంది. హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ప్రముఖ బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ తనకు కాలేజీ సీనియర్ అని తెలియడంతో రష్మిక ఆశ్చర్యపోయారు.
ఎపిసోడ్ సందర్భంగా నాగార్జున సరదాగా ముఖేష్ గౌడతో మాట్లాడుతూ రష్మికతో మైసూరు కన్నడలోనో లేక బెంగళూరు కన్నడలోనో మాట్లాడవచ్చని సూచించారు. ఆ తర్వాత ఇద్దరూ కన్నడలో ఆప్యాయంగా సంభాషించుకుంటూ ఉండగా, రష్మిక తనకు కాలేజీ జూనియర్ అని ముఖేష్ వెల్లడించారు. తన స్నేహితులు రష్మికతో కలిసి చదువుకున్నారని, అప్పట్లో తాను కూడా ఆమెను చూశానని చెప్పడంతో రష్మిక సంతోషంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖేష్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ షోలో మంచి విజయం సాధించాలని రష్మిక శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే సంభాషణలో రష్మిక నటించిన గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలోని తన నటన బాగుందని ముఖేష్ ప్రశంసించారు. దానికి స్పందించిన రష్మిక, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తదుపరి చిత్రం మైసా చూడాలని కోరుతూ అందులో యాక్షన్ సన్నివేశాలు కూడా చేశానని పేర్కొన్నారు. గుప్పెడంత మనసు ధారావాహికలో రిషి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముఖేష్ గౌడ, రష్మిక మధ్య ఉన్న ఈ కాలేజీ కనెక్షన్ గురించి ఆయన సోషల్ మీడియా టీమ్ కూడా ప్రత్యేకంగా పోస్ట్ చేయడంతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
మరోవైపు రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మైసా చిత్రం విడుదల వాయిదా పడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం ఈ నెల 27న విడుదల కావాల్సిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం త్వరలో వెల్లడించాల్సి ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్ బాస్ వేదికపై పంచుకున్న ఈ పాత జ్ఞాపకాల ముచ్చట ప్రేక్షకులను అలరించింది.
Also Read: బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయండి