మాస్కోలో ఫెలిక్స్ జెర్జిన్‌స్కీ స్మారక ఫలకం ఆవిష్కరణ
సూర్య అంతర్జాతీయ డెస్క్: సోవియట్ తొలి రహస్య పోలీసు వ్యవస్థ చీకా వ్యవస్థాపకుడు మరియు రెడ్ టెర్రర్ ప్రధాన సూత్రధారులలో ఒకరిగా చరిత్రలో నిలిచిన ఫెలిక్స్ జెర్జిన్‌స్కీ గౌరవార్థం మధ్య మాస్కోలోని స్లావ్యాన్స్కాయా స్క్వేర్‌లో కాంస్య స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. మాస్కో నగర యంత్రాంగం మరియు రష్యా భద్రతా సంస్థ ఎఫ్‌ఎస్‌బీ పబ్లిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ఫలకాన్ని ప్రతిష్ఠించగా, ఆయన్ను అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా అభివర్ణిస్తూ పారిశ్రామికీకరణకు నాంది పలికిన వ్యక్తిగా పేర్కొన్నారు. 1924 నుంచి 1926 మధ్య ఆయన నేతృత్వం వహించిన సుప్రీం ఎకనామిక్ కౌన్సిల్ భవన ముఖభాగంపై ఈ స్మారక ఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రష్యా తొలి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంటూరోవ్, అధ్యక్ష సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్‌స్కీ, మాస్కో సిటీ డుమా చైర్మన్ అలెక్సీ షాపోష్నికోవ్, ఎఫ్‌ఎస్‌బీ పబ్లిక్ కౌన్సిల్ అధిపతి వాసిలీ టిటోవ్ తదితరులు పాల్గొన్నారు. జెర్జిన్‌స్కీని రొమాంటిక్ ఆదర్శవాదిగా అభివర్ణించిన మెడిన్‌స్కీ, చారిత్రక స్మారకాలను ధ్వంసం చేయడం సరికాదని, ఉమ్మడి జ్ఞాపకాలలో భాగంగా ఇలాంటి ఫలకాలను ఆవిష్కరించడం విలువైన విషయమని వ్యాఖ్యానించారు. శిల్పి సలావత్ షెర్బకోవ్ రూపొందించిన ఈ ఫలకం ఆవిష్కరణను 1924 నవంబర్ 20న మెటల్ పరిశ్రమ విభాగానికి ఆయన నేతృత్వం వహించిన చారిత్రక సందర్భానికి అనుసంధానించి నిర్వహించారు.
1917 విప్లవం అనంతరం చీకాను స్థాపించి నడిపిన జెర్జిన్‌స్కీ, ఆ తర్వాత ఏర్పడిన ఎన్కేవీడీ, కేజీబీ, ప్రస్తుత ఎఫ్‌ఎస్‌బీ సంస్థలకు పునాది వేశారు. 1958 నుంచి 1991 వరకు లుబ్యాంకా స్క్వేర్‌లో నిలిచిన ఆయన విగ్రహాన్ని సోవియట్ పతనం సమయంలో తొలగించి, ప్రస్తుతం మ్యూజియాన్ పార్క్‌లో ఉంచారు. ఇటీవలి కాలంలో రష్యాలోని పలు ప్రాంతాలలో జెర్జిన్‌స్కీ విగ్రహాలు, స్మారకాలను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఫ్‌ఎస్‌బీ అకాడమీకి తిరిగి ఆయన పేరును పునరుద్ధరించారు.
సోవియట్ కాలంలో నిర్బంధాలకు గురైన బాధితుల జ్ఞాపకాలు, చారిత్రక అంశాల ఎంపికపై విమర్శలు, చర్చలు కొనసాగుతున్న వేళ, మాస్కో నడిబొడ్డున బహిరంగ ప్రదేశంలో ఈ స్మారక ఫలకం ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక నిర్వాహకుడిగా ఆయన పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ చేపట్టిన ఈ చర్య రష్యా రాజకీయ, చారిత్రక వర్గాలలో ఆసక్తిని రేకెత్తించింది.