రెండో కార్తీక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
సామర్లకోట మేజర్ న్యూస్ : కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి నెలకొనగా,శివనామస్మరణలు,వేదమంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
పంచారామాల్లో ఒక్కటైనా సామర్లకోట శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో రెండో కార్తీక సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిప్రపత్తులతో నిర్వహించారు.స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయానికి వచ్చే మార్గాలు, ప్రాంగణం భక్తులతో సందడిగా కనిపించాయి.భక్తులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా వేదమంత్రాల నడుమ స్వామివారికి విశేష అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్తీక మాసంలో సోమవారానికి ఉన్న విశిష్టతను పురస్కరించుకుని మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రాంగణంలో దీపాలు వెలిగించి కార్తీక దీపారాధనలు చేశారు.దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా దర్శనమిచ్చాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కంటే జగదీష్ మోహన్,ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా క్యూలైన్ల నిర్వహణతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.ఆలయ ఈఓ బల్ల నీలకంఠం పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది సేవలందించారు.అదేవిధంగా భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో భీమేశ్వర స్వామి ఆలయం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. స్వామివారి దర్శనం,కార్తీక దీపారాధనలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.ఉదయం నుంచి కొనసాగిన భక్తుల రాకతో ఆలయ పరిసరాలు శివమయంగా మారాయి.