ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ _2026)ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
రంపచోడవరం సూర్య ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సోమవారం సాయంత్రం రాష్ట్రలోని జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ _ 2026) ప్రక్రియ పురోగతి, ఓటరు నమోదు, ఏ ఎస్ డి ఓటర్ల వివరాల పరిశీలన తదితర అంశాలపై సమీక్షించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశ మందిరం నుంచి పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్,జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. శివరావు, ఎస్.డి.సి. సత్యనారాయణ, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, అర్హులైన యువ ఓటర్ల నమోదు, ఏ ఎస్ డి ఓటర్ల వివరాల పరిశీలన, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ తదితర అంశాలపై జిల్లా అధికారులు వివరాలు సమర్పించారు.పోలవరం జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మొత్తం 38,927 మంది ఏ ఎస్ డి ఓటర్లను గుర్తించినట్లు అధికారులు వివరించారు. వీరిలో మరణించిన వారు, ఆచూకీ లభించని వారు లేదా గైర్హాజరైన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు, ఇతర కారణాలతో గుర్తించిన వారు, ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు ఉన్నట్లు తెలిపారు.ఏ ఎస్ డి జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాన్ని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ధ్రువీకరణ చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగింపునకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పారదర్శకంగా పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని ,సవరించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి దశను నిర్దేశిత గడువులో పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థల్లో అర్హులైన విద్యార్థులను గుర్తించి, వారితో ఓటరు నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.మిగిలిన అర్హులైన విద్యార్థులు కూడా ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, విద్యాసంస్థల వారీగా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, పేరు లేని పక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, ఓటరు జాబితాను పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడం లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.