బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు
ఎటపాక, మేజర్ న్యూస్ : పవిత్ర కార్తీక మాస రెండో సోమవారం సందర్భంగా పోలవరం జిల్లా ఎటపాక మండలం బుట్టాయిగూడెం శివాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరుడిని దర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి దీపారాధనలు చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.ఈ సందర్భంగా బుట్టాయిగూడెం శివాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు గొట్టు పుల్ల కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. భద్రాచలం వాసులు హయ్యాలా రాజేంద్ర కుమార్, గజలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు తన్మయ్ కుమార్, పల్లవి, హవిస్క, సాయిరాం, యామిని దంపతులు వారి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో ప్రతి సోమవారం నిరంతరంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కుసుమరాజు సురేష్, కిలారు రాజశేఖర్, అరవ కామేశ్వరరావు, సరియం బుజ్జి, పులుసు కోటేశ్వరరావు తదితరులతో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.