andhrapradesh
వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా
- పీఓ, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్
రంపచోడవరం సూర్య ప్రతినిధి : పోలవరం జిల్లాలో వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక విజిలెన్స్ చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఐ. రాజేశ్వరి తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్రమ నిల్వలపై పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఎక్కడైనా వరి ధాన్యం లేదా బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు అనుమానం వచ్చినా, నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు కొనసాగిస్తున్నట్లు తెలిసినా ప్రజలు జిల్లా పౌరసరఫరాల శాఖ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఇందుకోసం 9494088922 నంబరుతో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.ఫిర్యాదు చేసే సమయంలో సంబంధిత దుకాణం, రైస్ మిల్లు లేదా గోదాం పేరు, గ్రామం లేదా పట్టణం, మండలం, అక్రమ నిల్వలకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేయాలని కోరారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
అక్రమ నిల్వలు, అక్రమ కార్యకలాపాల నియంత్రణలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి, తమకు తెలిసిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు అందించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ఐ. రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు.