పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు
- ఎంపీ అనుచరుడిని తరిమికొట్టిన పిఠాపురం జనసైనికులు
- పార్టీలు మారి వచ్చిన వ్యక్తులకు పదవులంటూ మండిపాటు
- రసాభాసగా మారిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక
- అన్ని పదవులు అమ్ముకుంటున్నారని విమర్శ
పిఠాపురం, మేజర్ న్యూస్ : పిఠాపురం పురపాలక సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరిగింది. వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో జనసేన కౌన్సిలర్ల మధ్య విభేదాలు బయటపడటంతో కౌన్సిల్ సమావేశ మందిరంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు కౌన్సిల్ హాల్ లోకి వచ్చి పార్టీ తరపున విప్పు జారీ చేశామని ధిక్కరించకూడదు అంటూ కౌన్సిలర్లను బుజ్జగించడంతో... కూటమి అభ్యర్థి బొజ్జ వెంకటేశ్వరరావు (దొరబాబు) వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తొలుత ప్రిసైడింగ్ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ జనసేన నూతన చైర్మన్ దానం లాజర్ బాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 36 మంది కౌన్సిలర్లు ప్రమాణం స్వీకారం చేశారు. తదుపరి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అధికారులు వివరించారు. 32వ వార్డు టీడీపీ కౌన్సిలర్ శివాల పాపారావు కూటమి తరఫున మూడో వార్డు జనసేన కౌన్సిలర్ బొజ్జ వెంకటేశ్వరరావు (దొరబాబు) పేరును ప్రతిపాదించగా, 29వ వార్డు జనసేన కౌన్సిలర్ మగాపు వి.వి.ఎన్. సత్యనారాయణ బలపరిచారు. అయితే ఈ ప్రతిపాదనకు మెజారిటీ కౌన్సిలర్ల నుంచి మద్దతు లభించలేదు. కేవలం ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జోక్యం చేసుకుని పార్టీ విప్ జారీ చేసినందున కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోయింది. అనూహ్యంగా 12వ వార్డు జనసేన కౌన్సిలర్ ఆగంటి ప్రభాకరరావు, 14వ వార్డు జనసేన కౌన్సిలర్ పిండి సంధ్య పేరును వైస్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా, 28వ వార్డు కౌన్సిలర్ రెడ్డెం రామారావు బలపరిచారు. దీంతో ఎన్నిక ప్రక్రియ ఒక్కసారిగా వివాదాస్పదమైంది. ఈ పరిణామంపై బొజ్జ వెంకటేశ్వరరావు ( దొరబాబు), రెడ్డెం రామారావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారిని పక్కనపెట్టి, అధికారం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం సరికాదని రెడ్డెం రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,కాకినాడ ఎంపీ ఎన్నికల సమయంలో పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మణి కుమార్ సమావేశ హాల్ లోకి చేరుకుని కౌన్సిలర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వివాదం కొనసాగడంతో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సమావేశ హాల్ నుంచి బయటకు వచ్చి చర్చలు జరిపారు. అనంతరం పిండి సంధ్య అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ఆగంటి ప్రభాకరరావు, బలపరిచిన రెడ్డెం రామారావులతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు చర్చలు కొలిక్కి రావడంతో ఆగంటి ప్రభాకరరావు కౌన్సిల్ సమావేశ హాల్లోకి వచ్చి పిండి సంధ్య పేరుతో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఒక్క అభ్యర్థి మాత్రమే మిగలడంతో ప్రిసైడింగ్ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ బొజ్జ వెంకటేశ్వరరావు ( దొరబాబు) ను వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి, పాడా పీడీ ఎన్. వి. శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎస్.టి.వి రాజేశ్వరావు, తదితరులు ఉన్నారు.
ఎంపీ అనుచరుడుని తరిమికొట్టిన జనసైనికులు...
జనసేన పార్టీ కోసం మొదటినుంచి కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు పార్టీలు స్థానం లేదని, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పనిచేసి ఇటీవల జనసేన పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట జనసేన నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు నిరసనకు దిగారు.
మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ వర్గాలు జనసేన పార్టీని పూర్తిగా నాశనం చేశాయని విమర్శించారు. నిరసన కార్యక్రమం జరుగుతున్న సమయంలో మున్సిపల్ కార్యాలయం నుండి ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అతని అనుచరులు బయటకు వచ్చారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న జనసైనికులు ఎంపీ అనుచరుడిగా ఉన్న వీరంరెడ్డి చక్రధర్ అలియాస్ చక్రిని అడ్డుకుని తరిమి కొట్టారు. పోలీసులు సాయంతో ఎంపీ అనుచరుడు అక్కడ నుంచి కారులో వెళ్లిపోయాడు. జరిగిన ఘర్షణ నేపథ్యంలో జనసేన నాయకుడు రాయవరం శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జనసేన నాయకుడిని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, వీర మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగితే ఇద్దరినీ అదుపులోకి తీసుకోవాలని, కానీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ జనసేన నాయకుడిని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏ పార్టీ కోసం అయితే కష్టపడి పని చేశాము ఆ పార్టీలోనే ఇటీవల చేరిన కొంతమంది నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతూ తమన పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టారని జనసేన వీర మహిళలు చల్లా లక్ష్మి, పిల్లా రమ్య జ్యోతి, కోలా దుర్గ, జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు జనసేన నాయకుడు శ్రీనును స్టేషన్లోనే ఉంచి అనంతరం విడిచిపెట్టారు.