సినిమాలో నేపథ్య సంగీతం భోజనంలో ఉప్పులాంటిది.. ఆసక్తికర విషయాలు పంచుకున్న డాన్ విన్సెంట్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సౌండ్ ఇంజనీర్, సౌండ్ డిజైనర్, సింక్ సౌండ్ రికార్డిస్ట్, సంగీత దర్శకుడిగా మలయాళ చిత్రసీమలో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాన్ విన్సెంట్ సినిమాలో శబ్దం, సంగీతం ప్రాధాన్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మట్టిపాడం, అడ్వంచర్స్ ఆఫ్ ఓమనక్కుట్టన్, కళ, న్నా తాన్ కేసు కొడు, 2018, లోక వంటి చిత్రాలతో మెప్పించిన ఆయన, తాజాగా తాను నేపథ్య సంగీతం అందిస్తున్న మెరీ బాయ్స్ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న నేపథ్యంలో తన సినీ ప్రయాణ విశేషాలను పంచుకున్నారు.
శబ్దం, సంగీతం ఏదైనా ప్రేక్షకుడు చెవితోనే వింటాడని, సినిమాకు రెండింటి ప్రాధాన్యత సమానమేనని డాన్ విన్సెంట్ పేర్కొన్నారు. సౌండ్, మ్యూజిక్ విభాగాలపై సమగ్ర అవగాహన ఉండటం వల్ల సినిమా సౌండ్‌స్కేప్‌ను సమర్థవంతంగా తీర్చిదిద్దగలమని వివరించారు. తొలుత ఒక విభాగంలో పనిచేసి తర్వాత మరో రంగానికి మారడం తన కెరీర్‌లో జరగలేదని, తన తొలి చిత్రం అడ్వంచర్స్ ఆఫ్ ఓమనక్కుట్టన్‌కే సౌండ్ డిజైన్, సంగీతం రెండింటినీ అందించానని తెలిపారు. అంతకుముందు దర్శకుడు రోహిత్ రూపొందించిన లఘు చిత్రాలకూ తానే ఆ బాధ్యతలు నిర్వర్తించానని గుర్తు చేసుకున్నారు.
మెరీ బాయ్స్ సినిమా పాటలను ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సిఎస్ స్వరపరిచారని, తాను ప్రధానంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని డాన్ విన్సెంట్ చెప్పారు. సన్నివేశాలకు అనుగుణంగా నేపథ్య సంగీతం సమకూరుస్తున్నప్పుడు కొన్నిచోట్ల పాట అవసరమనిపిస్తుందని, ప్రాథమిక దశలో రూపొందించిన పాటలన్నింటినీ సామ్ సిఎస్ అందించారని స్పష్టం చేశారు. సినిమా దృశ్యాలను పలుమార్లు పరిశీలించిన తర్వాతే నేపథ్య సంగీతంపై తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
సినిమాలో నేపథ్య సంగీతం అనేది భోజనంలో ఉప్పులాంటిదని డాన్ విన్సెంట్ అభివర్ణించారు. డైలాగ్‌లను కప్పివేయకుండా వాటికి బలం చేకూర్చేలా, సన్నివేశ తీవ్రతకు తగినట్లుగా మ్యూజిక్ ఉండాలని అన్నారు. కొన్ని సందర్భాల్లో సంగీతం కంటే సౌండ్ డిజైన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ఉదాహరణకు ఒక కామెడీ పంచ్‌కు వాద్య పరికరాల కంటే పక్షి లేదా జంతువు శబ్దం మరింత బాగా పనిచేస్తుందని వివరించారు. కళ వంటి డార్క్ మూడ్ చిత్రాల్లో సౌండ్‌తోనే మ్యాజిక్ చేయవచ్చని, అదే సమయంలో మాస్ సన్నివేశాలకు తగ్గట్టుగా సౌండ్ అండ్ మ్యూజిక్ సమన్వయం అవసరమని, ఇందుకు షూటింగ్ సమయంలో చుట్టుపక్కల వినిపించే ప్రెషర్ కుక్కర్ వంటి శబ్దాలు కూడా సవాళ్లను తెచ్చిపెడతాయని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఫాంటసీ థ్రిల్లర్ మాయన్తో రాబోతున్న జయసూర్య.. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల