అందం అంటే పుట్టుకతో వచ్చేదా లేక మనమే మలుచుకునేదా.. సద్గురుతో తమన్నా ఆసక్తికర చర్చ
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తన అందం, రూపంతో ఎప్పుడూ అభిమానులు, సినీ వర్గాల ప్రశంసలు అందుకునే నటి తమన్నా భాటియా అసలైన అందం అంటే ఏమిటనే అంశంపై ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తారు. ఇటీవల సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో జరిగిన ఓ సంభాషణలో తమన్నా మాట్లాడుతూ, మనం చూసే అందం మనకు పుట్టుకతో లభించేదా లేక జీవితకాలంలో మనమే రూపొందించుకునేదా అనే కోణంలో తన ఆలోచనలను పంచుకున్నారు. జీవితాంతం మనం ఎలా కనిపిస్తామనేది మన చేతుల్లో ఉండే సృష్టా లేక ముందే నిర్ణయించబడిన అంశమా అని ఆమె సద్గురును ప్రశ్నించారు.
దీనికి సద్గురు స్పందిస్తూ, శరీర ఆకృతి లేదా ముఖ లక్షణాల విషయంలో కొంత జన్యుపరమైన అంశాలు పాత్ర పోషించినప్పటికీ, మిగిలినదంతా వ్యక్తి తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటాడనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ముఖ ఆకృతి ఎలా ఉన్నా ఆనందంగా, ప్రశాంతంగా ఉండే ముఖమే నిజంగా అందమైనదని, ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోగలరని వివరించారు. తన పొడవాటి గడ్డాన్ని చూపిస్తూ సద్గురు సరదాగా మాట్లాడగా, సద్గురు కూడా ఎంతో అందంగా కనిపిస్తారని తమన్నా బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.
గతంలో తన రూపం, చర్మఛాయపై వచ్చిన వ్యాఖ్యలు, చర్చల గురించి కూడా తమన్నా పలు సందర్భాల్లో స్పష్టతనిచ్చారు. ఓదెల 2 ప్రమోషన్స్ సమయంలో మిల్కీ బ్యూటీ అన్న పదంపై స్పందిస్తూ, అలాంటి రూపం ఉన్నవారు ఆధ్యాత్మిక లేదా శక్తిమంతమైన పాత్రలు చేయలేరా అని నిలదీశారు. అలాగే తన అందం వల్ల అవకాశాలు కోల్పోతున్నాననే బాధిత పాత్రలో ఎప్పుడూ ఉండనని, ప్రతికూల వ్యాఖ్యలను వడపోసుకుని ముందుకు సాగడమే ముఖ్యమని గతంలో పలు వేదికలపై ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం తమన్నా ద వ్వాన్ చిత్రం తర్వాత రాగిణి 3, రేంజర్స్, పురుషన్, ఐపీఎస్ మరియా, వీ శాంతారామ్ వంటి పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విభిన్న కథలు, పాత్రలతో కెరీర్‌లో ముందుకు సాగుతున్న తమన్నా, అందంపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
Also Read: చైనా-ఈయూ అధికారుల మారకపు రేట్ల చర్చలు