'మన డాక్టర్ బాబే' విజయం సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్, అలీ!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: శ్రీ స్కంద హీరోగా పరిచయమవుతున్న చిత్రం మన డాక్టర్ బాబే. శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి నిర్మాణంలో చలపతి కుమార్ పువ్వల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన సిద్ధి, శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో రాజ్ తరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నటుడు అలీ మాట్లాడుతూ, చలపతి మీద నమ్మకంతో శ్రీ స్కంద తన సొంత డబ్బు పెట్టి ఈ సినిమాను నిర్మించారని, వారి కష్టాన్ని తాను దగ్గరగా చూశానని తెలిపారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ప్రేక్షకులు చూడరని, బలమైన కథ, కంటెంట్ ఉంటే కచ్చితంగా విజయం అందిస్తారని అన్నారు. నవంబర్ 20న విడుదలవుతున్న మన డాక్టర్ బాబే చిత్రాన్ని అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరారు. ముఖ్య అతిథి రాజ్ తరుణ్ మాట్లాడుతూ, హీరోగా, నిర్మాతగా వస్తున్న శ్రీ స్కందకు శుభాకాంక్షలు తెలిపారు. అలీతో కలిసి స్టేజ్ పంచుకోవడం సంతోషంగా ఉందని, దర్శకుడు చలపతికి మంచి విజయం దక్కాలని, నవంబర్ 20న థియేటర్లలో సినిమాను చూసి ఆదరించాలని ఆకాంక్షించారు.
హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ, వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చిందని, నవ్విస్తూనే మంచి సందేశం, భావోద్వేగాలతో సినిమాను చలపతి అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రేక్షకులు పెట్టే డబ్బు వృథా కాదని, తనకు అండగా నిలిచిన కృతాక్షి, బావ గౌతమ్, మురళీలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు చలపతి కుమార్ పువ్వల మాట్లాడుతూ, శ్రీ స్కంద వల్లే సినిమా ఈ స్థాయికి వచ్చిందని, ఇందులో అలీ కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని, నిర్మాణంలో కృతాక్షి ఎక్కడా రాజీ పడలేదని పేర్కొన్నారు.
నటీమణులు శృతి శంకర్, మోహన సిద్ధి మాట్లాడుతూ తమ పాత్రలు, షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ నవంబర్ 20న విడుదలవుతున్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హర్షవర్దన్ మాట్లాడుతూ, చలపతి మంచి వ్యక్తి అని, ట్రైలర్ బాగుందని, చిత్రబృందానికి మంచి విజయం దక్కాలని ఆకాంక్షించారు