'హే కన్నమ్మ' టీజర్ రిలీజ్.. ప్రేమకథతో ఆకట్టుకుంటున్న యశ్వంత్, ధనశ్రీ వర్మ!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యశ్వంత్, ధనశ్రీ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ ప్రేమకథా చిత్రం హే కన్నమ్మ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. శశి కుమార్ ముత్తులూరి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందిన ఈ టీజర్, సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నా జీవితం, నా కలలు, నా ఆశలు, నా ఇష్టాలు అంటూ తనదైన శైలిలో బతికిన వ్యక్తి, ఇప్పుడు నీ కళ్లతో ప్రపంచాన్ని చూస్తుంటే నువ్వు కోరుకున్న ప్రేమ ఎలా ఉంటుందో అర్థమవుతోంది కన్నమ్మ అంటూ సాగే వాయిస్ ఓవర్ టీజర్‌కు ప్రత్యేక బలాన్ని చేకూర్చింది. కథానాయకుడు యశ్వంత్, కథానాయిక ధనశ్రీ వర్మ పాత్రలను తీర్చిదిద్దిన విధానం, వారి మధ్య భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
సాంకేతిక విభాగాల పనితీరు కూడా టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. జయ్ కృష్ణ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని గాఢతను మరింత పెంచగా, రాంపీ నందిగం సినిమాటోగ్రఫీ సినిమాకు చక్కని విజువల్ ఫీల్‌ను తీసుకొచ్చింది. గాంధీ నడికూడికర్ ప్రొడక్షన్ డిజైన్ కథా ప్రపంచాన్ని సహజంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో కనిపిస్తున్నాయని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. సరికొత్త ప్రేమకథతో రూపొందుతున్న హే కన్నమ్మ టీజర్‌కు లభిస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.