బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
సూర్య జాతీయ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే రోజుల్లో ఇది తుపానుగా మారే ముప్పు ఉండటంతో రాష్ట్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో వాతావరణం అత్యంత అసాధారణంగా మారే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో వేటకు వెళ్లడం ప్రాణాలకే ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.
వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంత వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉండటంతో తీర ప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే సముద్రంలో వేట నిమిత్తం వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు మరియు ఒడ్డుకు చేరుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తుపాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో మత్స్యకార గ్రామాలు మరియు తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.