కుల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు భారీ ఎన్‌కౌంటర్ నిర్వహించి ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాయి. ఇటీవల సీఆర్పీఎఫ్ పోస్టుపై జరిగిన దాడికి కీలక సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ సహా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
కుల్గాం జిల్లాలోని లారూ (Laroo) ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
గత వారం కుల్గాంలోని మీర్‌బజార్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. ఆ దాడికి లతీఫ్ భట్ ప్రధాన సూత్రధారి అని గుర్తించిన భద్రతా బలగాలు అప్పటి నుంచి అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. దక్షిణ కశ్మీర్‌లో పలు ఉగ్రవాద దాడులు, వలస కార్మికుల హత్యల్లో కీలక నిందితుడిగా ఉన్న లతీఫ్ భట్ హతం కావడం ఉగ్రవాద సంస్థలకు గట్టి ఎదురుదెబ్బగా అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న బలగాలు, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.