పండుగ వాతావరణంలో నూతన చేయూత.రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ.
సంగారెడ్డి, ; ప్రతినిధి ; సమాజంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తూ, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తోందని వెల్లడించారు.సోమవారం సంగారెడ్డి ఎక్స్‌రోడ్‌లోని పీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో పండుగ వాతావరణంలో నిర్వహించిన సంగారెడ్డి నియోజకవర్గ స్థాయి నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాలకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.50 లక్షల చేయూత పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 18,591 నూతన పింఛన్లు మంజూరు కాగా, సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో 3,917 మందికి పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు చేయూత పింఛన్లు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ నెల 19వ తేదీన పింఛన్ నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు.
విద్యతోనే సమాజంలో మార్పు...
ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలన్నా, సమాజంలో జవాబుదారీతనం పెరగాలన్నా ప్రతి పౌరుడికి విద్య ఎంతో అవసరమని మంత్రి అన్నారు. విద్య, వైద్యం, సామాజిక భద్రతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సంగారెడ్డి వైద్య కళాశాలకు 18 పీజీ సీట్లు మంజూరయ్యాయని, సంగారెడ్డి, అందోల్ ప్రాంతాల్లో నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.జిల్లా ప్రజలకు అవసరమైన వైద్య చికిత్సల్లో 90 శాతం వరకు స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడూ వైద్య సేవలు, సామాజిక భద్రత విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మహిళా సాధికారతకు విద్యే పునాది..
మహిళా సాధికారతకు విద్యే బలమైన పునాది అని మంత్రి పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలకు ఉన్నత విద్యతో పాటు నైపుణ్య ఆధారిత విద్యను అందించాలని, పోటీ ప్రపంచంలో ఆత్మవిశ్వాసంతో రాణించేలా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు. సమానత్వ భావనతో మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
పేదల సొంతింటి కల సాకారం చేస్తాం..
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 5 వేల ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత, సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అంజమ్మ, అదనపు కలెక్టర్ పాండు, ఆర్డీవో రాజేందర్, డీఆర్‌డీఏ ఏపీడీ సూర్యారావు, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సదాశివపేట మున్సిపల్ కమిషనర్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నూతన పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.