ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావడమే లక్ష్యంగా సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు రూరల్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఏఎంసీ, పీఏసీఎస్ అధ్యక్షులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, పార్టీ కార్యకర్తల అహర్నిశల కృషి, నాయకుల సమష్టి ప్రయత్నాల వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం కేవలం పదవులు సాధించడానికే పరిమితం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి లభించిన గొప్ప అవకాశంగా, బాధ్యతగా భావించాలని సూచించారు.
పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తల శ్రమ, అంకితభావం, నాయకుల సమష్టి కృషి ఫలితంగానే కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలు చూపిన ఐక్యత, పట్టుదల అభినందనీయమని, ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఉండేలా నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్‌లతో కలిసి కూటమి నాయకత్వం రాష్ట్ర ప్రగతికి సమష్టిగా కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.
పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి ఆనం సూచించారు. కూటమి తరఫున బలపరిచిన అభ్యర్థులు ప్రతి గ్రామంలో ఘనవిజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎక్కడా వ్యక్తిగత బేధాభిప్రాయాలకు, చిన్నచిన్న విభేదాలకు తావివ్వకుండా కూటమి ఐక్యతను కాపాడుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు పరస్పర అవగాహనతో ముందుకు సాగుతూ, సాధ్యమైన చోట పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునే దిశగా కృషి చేయాలని సూచించారు. పార్టీ బలాబలాలను అంచనా వేసుకుంటూ, గ్రామస్థాయిలో ప్రజల మద్దతును కూడగట్టుకుని కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
పంచాయతీ ఎన్నికలు కేవలం రాజకీయ పోటీగా కాకుండా గ్రామాల అభివృద్ధికి ప్రజల మద్దతును మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా భావించాలని అన్నారు. గ్రామాల్లో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, ఐక్యత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, నాయకులందరూ ఒకే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఆత్మకూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత --మంత్రి ఆనం
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, సాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి రామ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన సమస్యలను గుర్తించి, వాటిపరిష్కారానికి ప్రణాళికాబద్ధంగాముందుకు వెళ్లాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.ప్రజాప్రతినిధులు తమకు వచ్చిన అవకాశాన్ని ప్రజాసేవకు వేదికగా మలుచుకోవాలని, గ్రామస్థాయిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు.
పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
పార్టీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెంపొందించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు.ఈ సమావేశంలో సీనియర్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకుడు తాళ్లూరు గిరినాయుడు, ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు, భీమవరం సొసైటీ చైర్మన్ యర్రమళ్ళ చిన్నారెడ్డి,రాష్ట్ర తెలుగుదేశం నాయకుడు పుట్టం బ్రహ్మానంద రెడ్డి,ఆత్మకూరు,మర్రిపాడు మండలాల తెలుగుదేశం అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాలకు చెందిన జెడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.