'ది మేజ్' ట్రైలర్ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ అవుతుందన్న రాహుల్ రవీంద్రన్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ నటుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ది మేజ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో సందడిగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్, దర్శక-నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డాక్టర్ రవికిరణ్ గడలై దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక, హృతికా శ్రీనివాస్, కమల్ కామరాజు, సృష్టి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. డాక్టర్ నైమిషారెడ్డి కాశీరెడ్డి సమర్పణలో సౌరోష కమల ఆర్ట్స్, యుఆర్ క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కె.ఎస్.ఆర్, డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, సినిమా ప్లాన్ చేస్తున్న సమయంలో దర్శకుడు రవికిరణ్ తనకు కథ చెప్పారని, తాను విన్న కథ తెరపైకి వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, టీమ్ అంతా అభిరుచితో పనిచేసిందని ప్రశంసించారు. చెన్నైలో పెరిగిన తనకు శ్రీరామ్ ఎప్పుడూ శ్రీకాంత్‌గానే తెలుసని, తన కాలేజీ రోజుల్లో ఆయన సినిమాలు చూశానని గుర్తు చేసుకున్నారు. నిజాయతీగా కష్టపడితే విజయం వస్తుందన్న శ్రీరామ్ మాటలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ది మేజ్ భారీ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకున్నారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ, 25 ఏళ్ల సినీ ప్రయాణంలో తొలిసారిగా టైటిల్ క్రెడిట్స్‌లో తన కోసం ప్రత్యేకంగా నేపథ్య సంగీతాన్ని అందించడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తాను కథ చెప్పినప్పుడు సాంకేతికంగా ఎలా తీస్తారని అడిగితే దర్శకుడు డెమో షూట్‌తో వచ్చారని, ఇక్కడ చెరగని ముద్ర వేయాలనే పట్టుదల ఆయనలో కనిపించిందని కొనియాడారు. దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలై మాట్లాడుతూ, ది మేజ్ అంటే పద్మవ్యూహం లేదా సంక్లిష్టమైన చిక్కుదారి అని, ఊహించని పరిస్థితుల్లో చిక్కుకున్న వ్యక్తి వాటి నుంచి ఎలా బయటపడతాడనే కథాంశంతో ఆద్యంతం మలుపులతో సినిమాను రూపొందించామని వివరించారు.
దర్శక-నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, తాను సినిమా చూశానని, ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టే క్రైమ్ థ్రిల్లర్‌గా ఇది నిలుస్తుందని, బడ్జెట్ పరిమితులు ఉన్నా సాంకేతికంగా గొప్ప అవుట్‌పుట్ వచ్చిందని ప్రశంసించారు. నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ, ఊహించని మలుపులతో పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఈ సినిమాకు ఉందన్నారు. నిర్మాత డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి మాట్లాడుతూ, ప్రివ్యూలో సెకండాఫ్ అంతా స్క్రీన్‌కు అతుక్కుపోయానని, శ్రీరామ్ చేరికతో ప్రాజెక్ట్ మరింత బలోపేతమైందని తెలిపారు. నటీమణులు హృతికా శ్రీనివాస్, ప్రియాంక, సృష్టి, నటుడు రవి వర్మ, సినిమాటోగ్రాఫర్ శివ కృష్ణ తమ అనుభవాలను పంచుకుంటూ, ప్రతి ఒక్కరికీ కొత్త థ్రిల్లర్ అనుభూతిని ది మేజ్ అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.