శ్రీకృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్: మార్కండేయుడిగా నటుడు బ్రహ్మాజీ కొత్త గెటప్ వైరల్!
టాలీవుడ్‌లో భక్తిరస మరియు పౌరాణిక కథాంశాలతో వస్తున్న సరికొత్త చిత్రం ‘కృష్ణంభజే’. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఈ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయగా, ప్రస్తుతం ఇది సినీ వర్గాల్లో విశేషంగా ట్రెండ్ అవుతోంది.
ఈ చిత్రంలో బ్రహ్మాజీ పౌరాణిక ప్రాధాన్యత ఉన్న 'మార్కండేయ' పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన పూర్తిగా కొత్త గెటప్‌లో కనికట్టు చేస్తున్నారు. కాషాయ వస్త్రధారణ, మెడలో రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో కూడిన ఆయన ఆధ్యాత్మిక రూపం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
జయశ్రీ మీడియా సమర్పణలో కలాల్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, నాగరాజ్ కొట్టే రచన మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మిక అంశాలను ప్రధానాంశంగా చేసుకుని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రదీష్ హీరోగా, వంగమయి పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రచ్చ రవి ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తుండటం విశేషం. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.