సెన్సార్ పూర్తి చేసుకున్న శివకుమార్ ‘చంద్రయాన్’.. ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ చిత్ర నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చంద్రయాన్’. ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై టెలివిజన్ మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు అన్నీ విజయవంతంగా పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రంలోని విభిన్నమైన కథాకథనాలు మరియు వినోదాన్ని చూసిన సెన్సార్ బృందం సభ్యులు సినిమా పట్ల ప్రశంసలు కురిపిస్తూ దీనికి ‘యు/ఎ’ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో అమాయకులైన నలుగురు కుర్రాళ్లు సొంతంగా రాకెట్ తయారు చేసి స్పేస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేసే సరికొత్త పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు, సవాళ్లు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించడంతో పాటు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచుతాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. రొటీన్ సినిమాలకు భిన్నంగా బలమైన కంటెంట్, వినోదం మేళవింపుతో వస్తున్న ఈ అడ్వెంచర్ ఫన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read: టాలీవుడ్ హీరో నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే!