షారుఖ్ ఖాన్‌తో పోలికలపై ఆర్యన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తండ్రిని బీస్ట్ అంటూ ప్రశంసలు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. తన తండ్రితో తనను పోల్చడంపై ఆర్యన్ తాజాగా స్పందిస్తూ, ఆ పోలికలను తాను ఒక ప్రశంసగానే తీసుకుంటానని స్పష్టం చేశారు. నంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తితో పోల్చడం సంతోషమేనని, తన తండ్రి ఒక బీస్ట్ లాంటి వారని అభివర్ణించారు. టైమ్ 100 నెక్స్ట్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రతి ఒక్కరినీ షారుఖ్ ఖాన్‌తో పోలుస్తూ ఉంటారని, అందులో తానూ ఒకడిగా ఉండటంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఆర్యన్ పేర్కొన్నారు. తన ఆలోచనలను కాగితంపై పెట్టడం నుంచి వాటిని పూర్తిస్థాయిలో తెరపైకి తీసుకురావడం వరకు ప్రతి దశను తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. సొంత గుర్తింపు కోసం కృషి చేస్తూనే, తండ్రి సాధించిన ఘనతలను గౌరవిస్తున్నట్లు తెలిపారు.
తన దర్శకత్వంలో వచ్చిన తొలి ప్రాజెక్ట్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌లో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర ఎలా సాధ్యమైందో కూడా ఆర్యన్ వివరించారు. షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ అదే ప్రాంతంలో ఉన్నారని తెలిసి కలవడానికి సమాచారం పంపగా, ఆయనే స్వయంగా సెట్‌కు వస్తానని చెప్పారట. సల్మాన్ రాకతో వెంటనే షాట్ సిద్ధం చేయమని చెప్పానని, ఆయన రాగానే అప్పటికప్పుడు ఒక డైలాగ్ ఇచ్చి కెమెరా ముందుకు పంపగా ఆ సన్నివేశం ప్రత్యేకంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు.
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ద్వారా ఆర్యన్ దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. మరోవైపు షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రీకొడుకుల కెరీర్ ప్రయాణంపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
Also Read: మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా బొత్స అమ్మోజమ్మ . వైస్ ఎంపీపీ గా బలిజిరెడ్డి నరిసింగరావు