కీర్తి సురేష్‌కు బంగారు ఉంగరం బహుమతి.. ట్రోల్స్‌పై నటి స్ట్రాంగ్ కౌంటర్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ దర్శకుడు, నటుడు మిస్కిన్, కథానాయిక కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం సత్యవాన్ సావిత్రి ప్రమోషన్ వేదికపై చోటుచేసుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్‌లో మిస్కిన్ కీర్తి సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించారు. అయితే ఈ కార్యక్రమంలో మిస్కిన్ కీర్తి మోకాలిని తాకిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా, కొందరు నెటిజన్లు అనవసర రాద్ధాంతం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు.
సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై కీర్తి సురేష్ ఘాటుగా స్పందించారు. తమ మధ్య తండ్రీకూతుళ్ల తరహా అనుబంధం ఉందని వేదికపైనే స్పష్టంగా చెప్పినప్పటికీ, తన ముఖంలో అసౌకర్యం కనిపించిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సినిమాల్లో సన్నివేశాల కోసం స్పర్శలు ఉంటాయి కదా అని బహిరంగ ప్రదేశంలోనూ అలాగే ప్రవర్తించాలని వాదించడం సరికాదని, ఆలోచనా విధానం మార్చుకోవాలని హితవు పలికారు. కీర్తి కౌంటర్‌తో సదరు నెటిజన్ తన పోస్టును తొలగించి క్షమాపణలు కోరారు.
ఈవెంట్‌లో మాట్లాడిన మిస్కిన్, కీర్తి సురేష్ నటనపై అమితానందం వ్యక్తం చేశారు. డోరతీ చిత్రంలో ఆమె నటన అద్భుతంగా ఉందని కొనియాడుతూ, ఆమెకు నడిగైయర్ తిలగం బిరుదు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఆమె నటించే ప్రతి సినిమాలో పేరు ముందు ఈ బిరుదును వేయాలని కోరారు. మరో ఇరవై ఏళ్ల పాటు ఆమె ఇలాగే నటిస్తూ ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు.
షూటింగ్ రెండో రోజే మిస్కిన్ తన కూతురు ఫొటో చూపించి, తన కూతురు అచ్చం కీర్తిలాగే ఉంటుందని చెప్పారని ఈ సందర్భంగా కీర్తి గుర్తు చేసుకున్నారు. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన సత్యవాన్ సావిత్రి చిత్రం ఈ నెల 20న థియేటర్లలో విడుదల కానుండటంతో ఈ వివాదం, ప్రశంసల మధ్య సినిమాపై ఆసక్తి నెలకొంది.
Also Read: ఉక్రెయిన్‌లోని ఒడెసాపై రష్యా భీకర దాడులు..