ఆదర్శకుటుంబం హౌస్ నెం 47 ట్రైలర్ లాంచ్.. కాలేజ్ లైఫ్ పై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ఆదర్శకుటుంబం: హౌస్ నెం 47. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా మరియు రాజ్ ప్రజ్వల్ కీలక పాత్రల్లో నటించారు. సూర్యదేవర రాధాకృష్ణ (ఎస్. చినబాబు) నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ కళాశాలలో విద్యార్థుల కోలాహలం మధ్య ఘనంగా ట్రైలర్ ఆవిష్కరణ వేడుకను నిర్వహించింది.
ఈ వేడుకలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడూతూ విద్యార్థులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో గుర్తున్న గొప్ప జ్ఞాపకాలన్నీ కాలేజ్ రోజుల్లో జరిగినవేనని ఆయన గుర్తు చేసుకున్నారు. కాలేజ్ అంటే కేవలం డిగ్రీ సాధించి ఉద్యోగం తెచ్చుకోవడం మాత్రమే కాదని, మంచి వ్యక్తిత్వంతో బయటకు రావడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ కాలేజ్ లైఫ్‌లోని నాలుగేళ్లలో భావి జీవితానికి సంబంధించిన కలలను ఊహించుకుని, వాటిని నిజం చేసుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ట్రైలర్‌కు లభిస్తున్న విశేష స్పందన పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా సాధారణ రొమాంటిక్ కామెడీలా కాకుండా ప్రేక్షకులు ఊహించని సరికొత్త కోణంలో ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో క్రైమ్ కామెడీ, డార్కర్ కామెడీ అంశాలను ప్రయత్నించామని, ఇలాంటి జోనర్‌లో సినిమా చేయడం వెంకటేష్‌తో పాటు తనకు కూడా ఎంతో కొత్త అనుభూతిని ఇచ్చిందని వివరించారు. కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ కాలేజీలో ఏది చదువుకున్నా జీవితం నిరంతరం ఆశ్చర్యపరుస్తూనే ఉంటుందని, అలాగే ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ఈ చిత్రం పక్కా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ వేడుకలో మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ ప్రీతి రెడ్డి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
Also Read: కివీస్ స్కోర్ 180/5!