ఈ-కామర్స్ దిగ్గజం కూపాంగ్‌కు రూ.1,800 కోట్ల భారీ జరిమానా విధించిన దక్షిణ కొరియా
సూర్య బిజినెస్ డెస్క్: ఈ-కామర్స్ మరియు ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా వెలుగుగొందుతున్న కూపాంగ్ కంపెనీకి దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో తనకున్న ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడినందుకు గాను కూపాంగ్ ఈట్స్ ప్లాట్‌ఫారమ్‌కు సుమారు 300.8 బిలియన్ వాన్లు (దాదాపు 220 మిలియన్ డాలర్లు లేదా భారత కరెన్సీలో సుమారు రూ. 1,800 కోట్లు) భారీ జరిమానా విధిస్తూ ఫెయిర్ ట్రేడ్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ అయిన రెస్టారెంట్లు మరియు వ్యాపారులపై అనుచిత నిబంధనలు రుద్దడం ద్వారా పోటీతత్వాన్ని దెబ్బతీశారని విచారణలో తేలడంతో ఈ కఠిన చర్యలు చేపట్టింది.
రెస్టారెంట్లు తమ ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించే ఆహార పదార్థాల ధరలు, ఆఫర్లు మరియు ఆర్డర్ కనీస పరిమితులు ఇతర ప్రత్యర్థి యాప్‌లతో పోలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ఉండకూడదనే అత్యంత అనుకూల వ్యాపారి నిబంధనను కూపాంగ్ అమలు చేసిందని నియంత్రణ సంస్థ తెలిపింది. ఈ షరతులకు అంగీకరించని హోటళ్లను తమ చెల్లింపు సభ్యత్వ ప్రయోజనాలు పొందే జాబితా నుంచి తొలగించడం లేదా ప్రదర్శనను తగ్గించడం ద్వారా వారి వ్యాపారాన్ని దెబ్బతీసినట్లు కమిషన్ స్పష్టం చేసింది. దీనివల్ల రెస్టారెంట్ యజమానులు స్వతంత్రంగా ధరలను నిర్ణయించుకునే హక్కును కోల్పోవడమే కాకుండా, పోటీ యాప్‌ల వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది.
కూపాంగ్‌తో పాటు దేశంలోని మరో ప్రధాన డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన బైడల్ మిన్‌జోక్ సంస్థపై కూడా యాంటీట్రస్ట్ యంత్రాంగం నిఘా పెట్టి జరిమానాలు విధించింది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిసి మార్కెట్‌లో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉండటంతో, వారి నియమ నిబంధనలు మార్కెట్‌లో ఆహార ధరలు పెరగడానికి మరియు వినియోగదారులపై అదనపు భారం పడటానికి దారితీశాయని రెగ్యులేటర్ పేర్కొంది. వ్యాపారులు తమ సొంత ధరల విధానాన్ని పాటించే వాతావరణాన్ని పునరుద్ధరించడానికి, అలాగే నూతన స్టార్టప్‌లు మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా ఈ దిద్దుబాటు ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపింది.
అయితే ఈ భారీ జరిమానాపై కూపాంగ్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో ఇటువంటి కేసులలో విధించిన జరిమానాల కంటే ఇది అనేక రెట్లు ఎక్కువగా ఉందని, ఇది ఎంతమాత్రం సమ్మతం కాదని పేర్కొంది. తమ వ్యాపార విధానాలపై తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటం చేస్తామని, కోర్టును ఆశ్రయించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దక్షిణ కొరియా ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఏకఛత్రాధిపత్యంపై చేపడుతున్న ఈ చర్యలు అంతర్జాతీయ టెక్ మరియు ఈ-కామర్స్ రంగాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.