రేపు వైరాలో విద్యార్థులకు నియోజకవర్గ స్థాయి ఎన్నికల అక్షరాస్యత పోటీలు..
వైరా రూరల్ ,మేజర్ న్యూస్: విద్యార్థుల్లో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించి, ప్రజాస్వామ్య విలువల పట్ల చైతన్యం కల్పించడమే లక్ష్యంగా వైరాలో నియోజకవర్గ స్థాయి ఎన్నికల అక్షరాస్యత పోటీలకు రంగం సిద్ధమైంది. భారత ఎన్నికల సంఘం, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 7న నియోజకవర్గ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన పాఠశాల స్థాయి పోటీలు విజయవంతమయ్యాయి.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 11న నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ), వైరా తహసీల్దార్ సురేష్ బాబు వెల్లడించారు. బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు వైరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పాఠశాలలు, కళాశాలల స్థాయిలో ఎంపికైన విద్యార్థులంతా నిర్ణీత సమయానికి పోటీ కేంద్రానికి చేరుకుని పోటీల్లో పాల్గొనాలని సూచించారు. విద్యార్థులకు సమాచారం అందించడంలో మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత సాధించిన ప్రతి విద్యార్థి పోటీల్లో పాల్గొనేలా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.