మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలి – సీపీఐ డిమాండ్
మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలి – సీపీఐ డిమాండ్
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్ :
మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం మిర్యాలగూడ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు, బావులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. దీంతో అనేక ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంటతో పాటు మిర్చి, పత్తి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మండలాల వారీగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులను గ్రామాలకు పంపించి పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు, పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా అకాల వర్షాలు, పిడుగుల కారణంగా నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని కోరారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శులు ఎ. రామలింగం, జి. యాదగిరి, పి. ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.