పలమనేరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త సంచలన ప్రకటన
పలమనేరు మేజర్ న్యూస్ :పలమనేరు రాజకీయం ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. పలమనేరు మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ కీలక నాయకురాలు స్థానిక పార్టీ నాయకత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వెంకటే గౌడ సోమవారం పార్టీ కార్యాలయంలో తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీలో అసలు సభ్యత్వమే లేని తనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర హాస్యాస్పదంగా ఉందంటూ ఒక ప్రత్యేక ప్రకటనలో తెలియజేశారు. పలమనేరు పట్టణ నియోజకవర్గ ప్రజలకు గత 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల స్ఫూర్తితో, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ప్రజాసేవలో కొనసాగానని గుర్తుచేశారు. గంగవరం మండలం జడ్పీటీసీగా, ఎంపీపీగా పలమనేరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పలు అధికారిక పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందించినట్లు తెలిపారు. అయితే గత కొంతకాలంగా పలమనేరు వైఎస్సార్‌సీపీలో కొందరు స్వార్థపరులు నడిపిస్తున్న కుటిల రాజకీయాలు, అంతర్గత విబేధాల కారణంగానే తాను చాలా కాలం క్రితమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు స్పష్టం చేశారు. తాను పార్టీ నుంచి వైదొలగిన విషయం నియోజకవర్గ ప్రజలందరికీ ఇప్పటికే స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్నటి రోజున జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు తాను పార్టీలో లేననే కనీస విషయాన్ని గమనించకుండా, మీడియా ముందు తనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించడం వారి అజ్ఞానానికి, హాస్యాస్పద రాజకీయనాయకత్వానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ప్రజలకు అండగా ఉండటమే తమ ప్రాధాన్యమని, పదవుల కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసమే రాజకీయాల్లో కొనసాగుతానని ఈ ప్రకటన ద్వారా ఆయన పునరుద్ఘాటించారు.
అనిల్ కుమార్ యాదవ్, పలమనేరు మేజర్ న్యూస్.