2035 నాటికి గరిష్ట స్థాయికి పెట్రోల్ డిమాండ్
సూర్య వాణిజ్య డెస్క్: భారతదేశంలో పెట్రోల్ (గ్యాసోలిన్) డిమాండ్ రాబోయే దశాబ్ద కాలంలో వేగంగా పెరిగి 2035 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) స్పష్టం చేసింది. వేగంగా పెరుగుతున్న వాహనాల సంఖ్య మరియు ఆర్థిక కార్యకలాపాల విస్తరణ వల్ల సమీప భవిష్యత్తులో ఇంధన వినియోగం పెరిగినప్పటికీ, 2035 తర్వాత డిమాండ్ క్రమంగా స్థిరీపడటం లేదా తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతుందని సంస్థ ప్రతినిధులు అంచనా వేశారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం క్రమంగా పెరగడం మరియు ప్రత్యామ్నాయ ఇంధనాలైన విత్తన ఇథనాల్ బ్లెండింగ్, సీఎన్‌జీ మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రవేశం పెట్రోల్ డిమాండ్ పై ప్రభావం చూపనుందని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. 2035 నాటికి గరిష్ట డిమాండ్ నమోదైనప్పటికీ, ప్రయాణ రవాణా రంంగానికి అవసరమైన ఇంధన సరఫరాలో సాంప్రదాయ చమురు వాటా క్రమంగా తగ్గి క్లీన్ ఎనర్జీ రంగానికి విస్తరించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అయితే పెట్రోల్ డిమాండ్ పీక్ స్థాయికి చేరినప్పటికీ, డీజిల్ మరియు పెట్రోకెమికల్ ఉత్పత్తుల వినియోగం మాత్రం మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని ఐఓసీ వర్గాలు పేర్కొన్నాయి. భారత పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు సరుకు రవాణా రంగానికి డీజిల్ ప్రధాన ఇంధనంగా ఉన్నందున దాని డిమాండ్ స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా చమురు శుద్ధి కర్మాగారాలను పెట్రోకెమికల్స్ మరియు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లించేందుకు శుద్ధి సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.
భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలు మరియు పర్యావరణ పరిరక్షణ విధానాలు దేశీయ చమురు మార్కెట్ భవిష్యత్తును పునర్నిర్మిస్తున్నాయి. 2035 నాటికి గ్యాసోలిన్ డిమాండ్ శిఖరాగ్రానికి చేరుకోవడం అనేది దేశీయ ఇంధన పరివర్తన ప్రక్రియలో కీలకమైన మైలురాయిగా నిలవనుంది. పెట్రోలియం ఆధారిత వినియోగం నుండి గ్రీన్ ఎనర్జీ వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తోదనడానికి ఈ అంచనాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.