విక్ర'మార్క్'! *కూటమి గెలుపులో కీలక పాత్ర *
విజయనగరం బ్యూరో, సూర్య : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడంలో తెరవెనుక కీలక పాత్ర పోషించిన నాయకుడిగా అవనాపు విక్రమ్ పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. జనసేన సీనియర్ నాయకుడిగా, ఆ పార్టీ సమన్వయకర్తగా ఉన్న విక్రమ్.. కూటమిలో తలెత్తిన సీట్ల సర్దుబాటు సంక్షోభాన్ని చక్కదిద్దడంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తమ్ముడు అవనాపు విజయ్‌కు అండగా నిలుస్తూ, మరదలు అవనాపు భార్గవి మేయర్‌గా గెలిచేందుకు మార్గం సుగమం చేశారు.
సీట్ల సర్దుబాటుతో మొదలైన సంక్షోభం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కూటమి నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. మేయర్ స్థానంతోపాటు మరో 18 కార్పొరేటర్ స్థానాలకు జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సమన్వయం కోసం విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా పలువురు కూటమి నేతలు ప్రయత్నించారు. అయినప్పటికీ జనసేన నాయకులు నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అనడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. కూటమిలో నెలకొన్న ఈ అనిశ్చితిని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించింది. జనసేన అభ్యర్థులు బరిలో కొనసాగితే టీడీపీ విజయావకాశాలు దెబ్బతింటాయని, మేయర్ పీఠం దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాల్లో అంచనాలు మొదలయ్యాయి.
సంక్షోభ సమయంలో రంగంలోకి విక్రమ్
ఇలాంటి కీలక తరుణంలో అవనాపు విక్రమ్ రంగంలోకి దిగారు. జనసేనలో తనకున్న పరిచయాలు, సమన్వయకర్తగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించి అసంతృప్త నేతలతో చర్చలు జరిపారు. తమ్ముడు అవనాపు విజయ్‌కు అండగా నిలుస్తూ, మరదలు భార్గవి గెలుపుపై భరోసా కల్పించారు. జనసేన నాయకుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ, నామినేషన్ల ఉపసంహరణకు వారిని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. విక్రమ్ చేసిన ఈ ప్రయత్నాలు కూటమిలో నెలకొన్న గందరగోళానికి తెరదించాయి. దీంతో టీడీపీ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థుల మధ్య పోటీ పరిస్థితులు తగ్గడంతో విజయావకాశాలు మెరుగుపడ్డాయి.
విభేదాలు పక్కనపెట్టి.. విజయమే లక్ష్యంగా..
సీట్ల సర్దుబాటు వివాదం సద్దుమణిగిన తర్వాత టీడీపీ, జనసేన నాయకులు పరస్పర విభేదాలను పక్కనపెట్టి ఎన్నికల ప్రచారంలోకి దిగారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమష్టిగా పనిచేశారు. ఒక దశలో కూటమి విజయం కష్టమని భావించిన పరిస్థితులు.. విక్రమ్ చొరవతో మారిపోయాయి. చివరకు విజయనగరం కార్పొరేషన్‌లో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతోపాటు మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థి అవనాపు భార్గవి మేయర్‌గా ఘన విజయం సాధించారు. కార్పొరేషన్‌పై టీడీపీ జెండా ఎగిరింది.
ఎన్నికల్లో భార్గవి విజయం విజయం వెనుక ఎందరో ప్రముఖులు, నాయకులు కృషి, కసి, పట్టుదల ఉందనడంలో సందేహం లేదు. ఐతే, విక్రమ్ చొరవ, రక్త సంబంధానికి ఇచ్చిన గౌరవం,విలువ ఇప్పుడు అందరూ ప్రత్యేకంగా చెప్పుకునేలా చేశాయి. మేయర్‌గా భార్గవి విజయం సాధించగా.. ఆమె గెలుపునకు మార్గం సుగమం చేయడంలో అవనాపు విక్రమ్ పాత్ర ప్రత్యేకంగా నిలిచిందనేది వారి అభిప్రాయం. కాగా, కూటమి రాజకీయాల్లో సమన్వయం ఎంత కీలకమో విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలు మరోసారి చాటిచెప్పాయి.