విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా నషా ముక్త యువ కార్యక్రమం, జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో శనివారం 100 రోజుల నషా ముక్త యువ కార్యక్రమంతో పాటు జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్లు I మరియు V ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమమైన “నషా ముక్త యువ వికసిత భారత్”లో భాగంగా 100 రోజుల నషా ముక్త యువ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలు, ఇతర హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన, బాధ్యతాయుతమైన యువతతోనే వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంపైనే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు విద్య, శారీరక దృఢత్వం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నషా ముక్త భారత్ అభియాన్ ప్రచారకర్తలుగా మారి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.
అనంతరం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారత ఉక్కుమనిషి, దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను ఏకీకృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొంటూ, విద్యార్థులు పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యం, దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె. సునీత మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంచి అలవాట్లను అలవరచుకోవడంతో పాటు సామాజిక సేవలో యువత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి. వీరారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో విద్యాసంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నషా ముక్త యువ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఎస్ఎస్ యూనిట్లను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, నషా ముక్త సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాలను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. ఆర్.వి.ఎస్.ఎస్. నాగభూషణరావు, డా. పి.బి. సుచరిత సమన్వయం చేశారు. వివిధ విభాగాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.