విజయవాడ నుంచి సోమనాథ్‌కు స్వాభిమాన్ యాత్ర
విజయవాడ నుంచి సోమనాథ్‌కు స్వాభిమాన్ యాత్ర
రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రముఖ దేవాలయాల నుంచి తరలివెళ్లిన 1,060 మంది భక్తులు
18 బోగీలతో విజయవాడ నుంచి వేరావల్ వరకు ప్రత్యేక ఎఫ్‌టీఆర్ రైలు ఏర్పాటు
పచ్చజెండా ఊపి యాత్రను ప్రారంభించిన విప్ బొండా ఉమా, కలెక్టర్ జి.లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ కే.రామచంద్ర మోహన్
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో భాగంగా విజయవాడ నుంచి వేరావల్ (సోమనాథ్) క్షేత్రానికి 1,060 మంది భక్తులతో బయల్దేరిన ప్రత్యేక రైలు యాత్రను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ ఆదివారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు నిండిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జనవరి 2026 నుంచి జనవరి 2027 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ, భాషాసాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాల నుంచి ఎంపికైన 1,060 మంది భక్తులతో పాటు రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించేందుకు 100 మంది కళాకారులతో కూడిన బృందం కూడా యాత్రలో పాల్గొంటోంది. విజయవాడ నుంచి వేరావల్ వరకు 16 స్లీపర్, 2 ఎస్ఎల్ఆర్ బోగీలతో మొత్తం 18 బోగీల ప్రత్యేక ఎఫ్‌టీఆర్ రైలును ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ప్రతి 2022 మందికి ఒక బృంద నాయకుడిని, ప్రతి బోగీకి ప్రత్యేక పర్యవేక్షకులను నియమించారు. ప్రయాణంలో భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలతో పాటు ఇతర వసతులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారుల బృందం వెంట వెళ్తోంది. గుజరాత్‌లో భక్తులకు రెండు రోజుల పాటు స్థానిక రవాణా, వసతి, ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శన ఏర్పాట్లు కల్పించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సోమనాథ్‌తో ముడిపడి ఉన్న భారతీయ సాంస్కృతిక వైభవం, ఆత్మగౌరవాన్ని చాటడమే యాత్ర లక్ష్యమన్నారు. విజయవాడ నుంచి 1,060 మంది భక్తులు ఆధ్యాత్మిక ప్రతినిధులుగా బయల్దేరడం గర్వకారణమని పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ జాతీయ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావడం గర్వకారణమని, కేంద్ర సాంస్కృతిక శాఖ, గుజరాత్ ప్రభుత్వం, ఐఆర్‌సీటీసీ, రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ మాట్లాడుతూ జాతి సమగ్రత, భక్తి విశ్వాసాలను చాటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్. మల్లికార్జునరావు, దేవాదాయ, సాంస్కృతిక, రైల్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.