వెల్దుర్తి పారిశ్రామికాభివృద్ధి రమేష్ శెట్టితోనే సాధ్యం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య గ్రామాభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మద్దతు: బొమ్మన దశరథరామిరెడ్డి నా ఎదుగుదలకు టీవీ శివయ్యే కీలకం: సంజన్న గౌడు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే అది సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టితోనే సాధ్యమని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య పేర్కొన్నారు. గురువారం వెల్దుర్తి సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన ఆర్యవైశ్యుల వనభోజన కార్యక్రమానికి ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరై మాట్లాడారు.
గ్రామ పెద్ద బొమ్మన దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి ధ్యేయంగానే సర్పంచ్ బరిలో నిలిచిన తిరువీధి రమేష్ శెట్టికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బరిలో ఉన్న అభ్యర్థులందరూ మద్దతు కోరినప్పటికీ, ఎలాంటి లాభాపేక్ష లేని సేవా దృక్పథం ఉన్న రమేష్ శెట్టి అన్ని విధాలా అర్హులని భావించి సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు.
మరో గ్రామ పెద్ద సంజన్న గౌడు మాట్లాడుతూ.. తన ఎదుగుదలకు తిరువీధి శివయ్య కుటుంబం ఎంతో మేలు చేసిందని, ఆపదలో అండగా నిలిచి తాను ఈ స్థాయికి చేరేందుకు దోహదపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఆ కుటుంబానికి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని భావించి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించానని, రమేష్ శెట్టి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కోట్రికె ఫణిరాజ్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు ఇది మంచి అవకాశమని, రమేష్ శెట్టిని గెలిపించుకుంటే మన సేవా తత్పరత ఏంటో ప్రజలకు తెలుస్తుందన్నారు. ఏపీ వాసవి సేవాదళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తులూరి కృష్ణ కిరణ్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి రమేష్ శెట్టిని గెలిపించుకుంటే సమాజానికి ఎంతో గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు.
అనంతరం సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టి మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధ్యమవుతుందన్నారు. తనకు ఎలాంటి ధనాపేక్ష లేదని, వెల్దుర్తికి సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తమ పూర్వీకులు వెల్దుర్తికి అందించిన సుపరిపాలనను మరోసారి అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నేత ఇల్లూరి సుధాకర్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తిరువీధి వంశీధర్, తిరువీధి రాంప్రసాద్, తిరువీధి సుధీంద్ర, అమ్మవారిశాల గౌరవాధ్యక్షులు సముద్రాల శ్రీరాములు, కాంట్రాక్టర్ ఎల్లనాగిరెడ్డి, ఒంగోలు సాయి, తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.