వీఎస్‌యూ ఫార్మసీ కళాశాలలో ఘనంగా గెస్ట్ లెక్చర్, పోటీల నిర్వహణ.
కావలి, మేజర్ న్యూస్ : కావలి పట్టణంలోని వీఎస్‌యూ ఫార్మసీ కళాశాలలో నిర్వహిస్తున్న 'ఫార్మసీ వీక్' వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక అతిథి ఉపన్యాసం (గెస్ట్ లెక్చర్) మరియు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె. మాధవరెడ్డి "భారతదేశంలో యాంటీమైక్రోబయల్ నిరోధకతను అరికట్టడంలో మరియు 'స్వస్థ భారత్' లక్ష్య సాధనలో మందులు లేని ప్రత్యామ్నాయ చికిత్సగా ఫిజియోథెరపీ పాత్ర" అనే అంశంపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్న అనారోగ్యానికి మందులే పరిష్కారం కాదని, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. సహజ రోగనిరోధక శక్తిని (నేచురల్ ఇమ్యూనిటీ) పెంపొందించుకోవడానికి అవసరమైన పలు వ్యాయామ పద్ధతులను విద్యార్థులకు వివరించారు.
అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ వేములూరి శైలజ, ప్రిన్సిపాల్ నిత్యానంద రెడ్డి మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం డాక్టర్ మాధవరెడ్డిని శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. మధ్యాహ్నం సెషన్‌లో ఫార్మసీ విద్యార్థులకు డ్రాయింగ్ మరియు పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.