వైసీపీ నాయకుడు నరేంద్ర పై దాడి దుర్మార్గం, మాజీ ఎంపీ తలారి రంగయ్య.
కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి :-
ఎస్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కంబదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నరేంద్రపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడిన నరేంద్రను తలారి రంగయ్య పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నివాసంలో పరామర్శించారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాల్సిన సమయంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందన్నారు. ఎన్నికల్లో వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. గాయపడిన నరేంద్రకు, ఆయన కుటుంబ సభ్యులకు వైసీపీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో రాజకీయ కక్షలు, ఫ్యాక్షన్ తరహా వాతావరణాన్ని సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని రంగయ్య హెచ్చరించారు. ప్రజలను భయపెట్టి రాజకీయ ప్రయోజనాలు సాధించాలనే ఆలోచనలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటం ఏ మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. నరేంద్రపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను తలారి రంగయ్య కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే తగిన సమాధానం చెబుతారని రంగయ్య పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని నరేంద్రకు మద్దతు తెలిపారు.