వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలిశెట్టి పెద ఈశ్వరరావు కన్నుమూత!
ప్రముఖుల దిగ్బ్రాంతి... పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం
ఎస్.రాయవరం, నవంబర్ 4, మేజర్ న్యూస్:
ఎస్. రాయవరం మండలం, దార్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిశెట్టి పెద ఈశ్వరరావు (65) వైజాగ్‌లోని ఇండస్ హాస్పిటల్‌లో బుధవారం కన్నుమూశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈశ్వరరావు, తెల్లారితే ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆకస్మికంగా మృతి చెందడంతో పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రముఖుల సంతాపం:
ఈశ్వరరావు ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని పాయకరావుపేట మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, ఎస్.రాయవరం మండల పార్టీ అధ్యక్షులు ఎస్.ఏ.ఎన్. మధువర్మ, పార్టీ సీనియర్ నాయకులు కంచుమూతి శ్రీనివాసరావు, అద్దేపల్లి నూకనాయుడు, మాజీ జడ్పీటీసీ నీలాంధరరావు, దార్లపూడి మాజీ సర్పంచ్ మర్లపల్లి శుభాషిణి, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సింహాద్రి యాదవ్ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
గ్రామానికి, పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివని, ఆయన మరణం కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు తీరని లోటని వారు పేర్కొన్నారు. ఈశ్వరరావు అంత్యక్రియలు స్వగ్రామమైన దార్లపూడిలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ప్రార్థించారు.