ఉన్నత విద్యలో గుణంకాల నమోదు కీలకం -డేటా సేకరణ, సమర్పణలో సమన్వయం, ప్రామాణికతకు ప్రాధాన్యమివ్వాలి -రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ లో ఆప్సి చేర్మెన్ ప్రొఫెసర్ ఎస్.విజయ భాస్కర్ రావు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :
ఉన్నత విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి, సమర్థవంతమైన విద్యా ప్రణాళికల రూపకల్పనకు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఖచ్చితమైన, ప్రామాణికమైన గణాంకాలు ఎంతో కీలకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయ భాస్కర్ రావు పేర్కొన్నారు. విజయవాడలోని లబ్బీపేట ఫార్చ్యూన్ మురళీ పార్క్‌లో ఏఐఎస్‌హెచ్‌ఈ - ఏపీఎస్‌సీహెచ్‌ఈ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత ఉన్నత విద్యా సర్వే రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉన్నత విద్యా సంస్థల ప్రొఫైల్, విశ్వసనీయత, ప్రత్యేకతలను ప్రతిబింబించడంలో గణాంకాల పాత్ర కీలకమని తెలిపారు. డేటా నమోదులో పొరపాట్లు, అసమానతలు ఉంటే సంస్థల మూల్యాంకనంతో పాటు స్థూల నమోదు నిష్పత్తి గణనపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐఎస్‌హెచ్‌ఈ, ఎన్‌ఐఆర్‌ఎఫ్, న్యాక్ తదితర విభాగాలకు సమర్పించే సమాచారంలో ఏకరూపత ఉండేలా సంబంధిత సమన్వయకర్తలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు.
డేటా ధ్రువీకరణతోనే నాణ్యమైన గణాంకాలు
ఈ సంద్భంగా ఏపీఎస్‌సీహెచ్‌ఈ వైస్ చైర్‌పర్సన్, ఏఐఎస్‌హెచ్‌ఈ రాష్ట్ర నోడల్ అధికారి ప్రొఫెసర్ కె.రత్న శీలామణి మాట్లాడుతూ.. ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వే లక్ష్యాలు, పరిధి, యూనివర్సిటీ నోడల్ అధికారుల బాధ్యతలు, డేటా సమర్పణలో పాటించాల్సిన విధివిధానాలను వివరించారు. సంస్థల నుంచి సేకరించే సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిపోల్చి, ధ్రువీకరించిన అనంతరమే సమర్పించాలని సూచించారు. అనంతరం ఏపీఎస్‌సీహెచ్‌ఈ కార్యదర్శి ప్రొఫెసర్ బి.తిరుపతి రావు మాట్లాడుతూ, విద్యా రంగంలో సమర్థవంతమైన ప్రణాళికలు, ఆధారపూర్వక విధాన నిర్ణయాలకు ఖచ్చితమైన, ప్రామాణికమైన, సమకాలీన సమాచారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంస్థల అసలు రికార్డులకు, ఏఐఎస్‌హెచ్‌ఈ ద్వారా సమర్పిస్తున్న సమాచారానికి మధ్య కనిపిస్తున్న వ్యత్యాసాలను తగ్గించేందుకు ఈ వర్క్‌షాప్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డేటా సమర్పణలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాలను పాటించాలని అధికారులకు సూచించారు.
సాంకేతిక అంశాలపై రిసోర్స్ పర్సన్ అవగాహన
న్యూఢిల్లీకి చెందిన ఏఐఎస్‌హెచ్‌ఈ రిసోర్స్ పర్సన్లు ఎన్.బి.విశ్వాస్, అసిస్టెంట్ డైరెక్టర్; శుభ్దా శర్మ, సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్; శివమ్ పాండే, ప్రోగ్రామర్ సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. సర్వే విధానం, వివిధ డేటా క్యాప్చర్ ఫార్మాట్లు సమాచార నమోదు, డేటా ధ్రువీకరణ, ఆన్‌లైన్ సమర్పణ ప్రక్రియలను వివరించారు. గతంలో సమర్పించిన వివరాల్లో చోటుచేసుకున్న సాధారణ పొరపాట్లు, అసంపూర్ణ సమాచారం వల్ల ఎదురయ్యే సమస్యలను ఉదాహరణలతో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 62 మంది యూనివర్సిటీ నోడల్ అధికారులు పాల్గొన్న ఈ వర్క్‌షాప్ ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో డేటా నాణ్యత, జవాబుదారీతనం, సాంకేతిక సామర్థ్యం పెంపొందించడంతోపాటు విశ్వసనీయమైన గణాంకాల ఆధారంగా విద్యా రంగ అభివృద్ధికి మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమం కానుంది.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్