తుఫాను ముప్పు అప్రమత్తంలో జిల్లా యంత్రాంగం
బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ‘ఆర్నాబ్’ తుఫాన్ తీరం వైపు శరవేగంగా దూసుకొస్తోంది. వచ్చే అక్టోబర్ 27, 28 తేదీలలో ఈ తుఫాన్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా బాపట్ల – విశాఖపట్నం మధ్య ప్రాంతంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో హై అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంత ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు జిల్లా పాలనా యంత్రాంగం 24 గంటలూ అందుబాటులో ఉంటూ సహాయక చర్యలకు సిద్ధమైంది.
కోతకొచ్చిన వరికి గండం:
కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలలో ఖరీఫ్ వరి పంట కోత దశకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో వరి కోతలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల కంకులు గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే చేలల్లో నీరు నిలిచిపోయి కోత పనులకు ఆటంకం ఏర్పడుతుంది. బలమైన ఈదురుగాలులు వీచితే వరి పంట నేలకొరిగే ప్రమాదం ఉంది. నేలవాలిన చేల్లో నీరు చేరితే కంకులు తడిసి ధాన్యం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ధాన్యం రంగు మారడం, మొలకెత్తడం వంటి సమస్యలు తలెత్తితే రైతులకు మరింత నష్టం వాటిల్లుతుంది.
నెలల తరబడి కష్టపడి పండించిన పంటను ఇంటికి చేర్చుకునే సమయంలో ప్రకతి విపత్తు ముంచుకొస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కోతలు ఆలస్యమైతే యంత్రాల అద్దెలు, కూలీల ఖర్చులు పెరుగుతాయి. చేలల్లో బురద కారణంగా యంత్రాలు దిగలేని పరిస్థితి ఏర్పడవచ్చు. పంట దెబ్బతింటే దిగుబడి తగ్గడంతో పాటు ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడమూ కష్టమవుతుంది. తుఫాన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందోనని అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు.
కొబ్బరి తోటలపై గాలుల దాడి భయం
కోనసీమకు ప్రత్యేక గుర్తింపునిచ్చే కొబ్బరి తోటలపైనా తుఫాన్ ప్రభావం పడే ప్రమాదం ఉంది. బలమైన గాలులు వీచితే చెట్లు నేలకొరిగే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాయల గెలలు విరిగిపడటం, చెట్లు దెబ్బతినడం వల్ల దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఒకసారి చెట్లు కూలిపోతే వాటిని తొలగించడం, తోటను తిరిగి పునరుద్ధరించడం రైతులకు అదనపు ఖర్చుతో కూడుకున్న పని. భారీ వర్షాలతో తోటల్లో నీరు నిలిచినా ఇతర పంటలకు నష్టం కలగవచ్చు.
ఇప్పటికే సాగు ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు తుఫాన్ నష్టం మరో భారంగా మారే ప్రమాదం ఉంది. గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలితే రవాణా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. తుఫాన్ గాలుల తీవ్రత తగ్గేవరకు తోటల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆక్వా చెరువుల్లోనూ కలవరం
జిల్లాలో రొయ్యలు, చేపల సాగుపై ఆధారపడిన రైతులకూ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో చెరువుల్లో నీటిమట్టం పెరిగి గట్లు తెగిపోతే రొయ్యలు, చేపలు బయటకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నీటి నాణ్యత మారడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఏరియేషన్ వ్యవస్థలు పనిచేయకపోతే సాగులో ఉన్న జీవులకు ముప్పు ఏర్పడవచ్చు. పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తవచ్చు. దీంతో చెరువుల గట్లను పటిష్టం చేసుకోవడం, నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు గమనించడం, విద్యుత్ పరికరాల భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఏర్పడింది.
నాలుగు రోజుల పాటు వేట బంద్
తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పడవలను ఒడ్డుకు చేర్చి సురక్షితంగా కట్టివేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు సుమారు నాలుగు రోజుల పాటు వేటకు దూరంగా ఉండాల్సి వస్తుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ వేటపైనే ఆధారపడి జీవించే కుటుంబాలకు ఈ విరామం ఆదాయ నష్టాన్ని కలిగించనుంది. చేపల విక్రయాలు, రవాణా, వేటకు సంబంధించిన అనుబంధ పనులపై ఆధారపడిన వారికీ ఉపాధి తగ్గనుంది.
సముద్రంలోకి వెళ్లవద్దన్న హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని ఒడ్డుకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. తీర ప్రాంతాల్లో పడవలను సురక్షితంగా ఉంచడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లో గస్తీ పెంచారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష
తుఫాన్ గండం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం క్యాంప్ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అక్టోబర్ 27, 28 తేదీలు అత్యంత కీలకమైనవని, ఎక్కడా చిన్నపాటి నిర్లక్ష్యానికి తావులేకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, పునరావాస కేంద్రాలలో సకల సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ లు కీర్తి చేకూరి, ఆర్. మహేష్ కుమార్ సమగ్ర ఆదేశాలు
ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ముగిసిన వెంటనే జిల్లా అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తుఫాన్ తీవ్రతను దష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం 24్ఠ7 పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కలెక్టర్ జారీ చేసిన ముఖ్యమైన మార్గదర్శకాలు:
సురక్షిత ప్రాంతాలకు తరలింపు: జిల్లాలోని 67 తీర ప్రాంత గ్రామాలపై ప్రత్యేక దష్టి సారించారు. సముద్ర తీరానికి అతి సమీపంలో నివసించే మత్స్యకారులను, తాటాకు మరియు పూరి గుడిసెలలో నివసించే నిరుపేద ప్రజలను తక్షణమే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలన్నారు.
వేటపై కఠిన ఆంక్షలు: సముద్రంలో ఆణిముత్యాల్లాంటి అలలు ఎగసిపడుతుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠిన నిషేధం విధించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని వెంటనే ఒడ్డుకు రప్పించే చర్యలు చేపట్టారు. తీరప్రాంతాల్లో బోట్లను సురక్షితంగా కట్టివేసి ఉంచారు.
రవాణా, బీచ్‌లలో బోటింగ్ నిలిపివేత: తీరప్రాంత మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు, బీచ్ ప్రాంతాల్లో బోటింగ్, పర్యాటకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ప్రమాదకర ప్రదేశాల్లో పోలీసుల ద్వారా గస్తీ పెంచారు.
అంతర శాఖల సమన్వయం: రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, వైద్యారోగ్య, డ్రైనేజీ మరియు విద్యుత్ శాఖల అధికారులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ 24 గంటలు కంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితిని సమీక్షించాలని స్పష్టం చేశారు.
దీనికితోడు జిల్లాకే ప్రతిష్టాత్మకమైన కొబ్బరి తోటలు, ఆక్వా (రొయ్యలు, చేపల) సాగుదారులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీకర ఈదురు గాలుల వలన కొబ్బరి చెట్లు కూలిపోవడం, ఆక్వా చెరువులు మునిగిపోయి వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. రైతులకు అండగా ఉండేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభించారు.
ముందస్తు ముమ్మర ఏర్పాట్లు
ఈ సమీక్షా సమావేశం మరియు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి లక్ష్మీనారాయణ, సిహెచ్. శ్రీనివాస్, జియో కోఆర్డినేటర్ లీర్తి, రెవెన్యూ మరియు ఇతర శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అత్యవసర సహాయం కోసం జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రాకూడదని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.