ఉద్యాన రంగంలో వినూత్న ఆలోచనలకు వేదిక హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్‌లో విద్యార్థుల సృజనాత్మకత
వెంకటరామన్నగూడెం: విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, స్టార్టప్ స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఉద్యాన రంగ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహించే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్), రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఇన్నోవేషన్ ఛాలెంజ్–1.0లో భాగంగా హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్‌ను నిర్వహించారు. వెంకటరామన్నగూడెంలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉద్యాన కళాశాల హార్టీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డా. పద్మలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు, వారి ఆలోచనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మలిచేందుకు హ్యాకథాన్‌లు దోహదపడతాయని ఆమె అన్నారు. ఉద్యాన రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు సాంకేతికత, నూతన ఆవిష్కరణలతో పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్.బి.వి. చలపతి రావు మాట్లాడుతూ.. త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయల్లో పంట అనంతర నష్టాలను తగ్గించేందుకు సమర్థవంతమైన పంట అనంతర నిర్వహణ సాంకేతికతలు, వినూత్న పరిష్కారాల అభివృద్ధి అత్యంత అవసరమని పేర్కొన్నారు. కోత అనంతరం నిల్వ, రవాణా, శీతలీకరణ, విలువ జోడింపు వంటి దశల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా ఉత్పత్తి నష్టాలను తగ్గించి రైతులకు మెరుగైన ఆదాయం కల్పించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో ఆర్‌టీఐహెచ్ సీఈఓ షేక్ యాసీన్ షరీఫ్, ఆర్‌టీఐహెచ్ ఇంక్యుబేషన్ విభాగం అధిపతి చంద్ర ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.హ్యాకథాన్‌లో విద్యార్థులు ఉద్యాన రంగానికి సంబంధించిన వివిధ సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించే వినూత్న ఆలోచనలు, స్టార్టప్ ప్రతిపాదనలు, సాంకేతిక పరిష్కారాలను నిపుణుల ముందు ప్రదర్శించారు. ఉద్యాన పంటల ఉత్పత్తి, పంట అనంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతికత వినియోగం, వనరుల సమర్థ వినియోగం తదితర అంశాలపై విద్యార్థులు తమ ఆలోచనలను వివరించారు.విద్యార్థుల వినూత్న ఆలోచనలను నిపుణులు పరిశీలించి, వాటి సాధ్యాసాధ్యాలపై సూచనలు, మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థుల ఆలోచనలను స్టార్టప్‌లు, ఆచరణాత్మక వ్యాపార నమూనాలుగా అభివృద్ధి చేసేందుకు హార్టీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్, ఆర్‌టీఐహెచ్ సహకారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శిరీష సమన్వయంతో నిర్వహించారు. ఈ హ్యాకథాన్‌లో కళాశాల బోధనా సిబ్బంది కూడా పాల్గొని విద్యార్థులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం