తుపాను దెబ్బకు అప్రమత్తమైన అనకాపల్లి రూరల్ పోలీసులు.
కొప్పాకలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పునరుద్ధరణ.
కొండ చరియలు విరిగిపడడంతో
2 కుటుంబాల సురక్షిత తరలింపు.
అనకాపల్లి, అక్టోబర్ 28, మేజర్ న్యూస్; తుపాను, భారీ వర్షాల ప్రభావం నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు పర్యవేక్షణలో అనకాపల్లి రూరల్ పోలీస్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ రవి కుమార్ సిబ్బందితో కలిసి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొప్పాక సమీపంలోని ఆర్టీవో (ఆర్టీవో) కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై రెండు భారీ వృక్షాలు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ సీఐ, ఎస్ఐ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బందితో సమన్వయం చేసుకుని యుద్ధప్రాతిపదికన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కొప్పాక గ్రామం పాస్టర్స్ కాలనీలోని రెండు ఇళ్ల సమీపంలో స్వల్పంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని ముందే గుర్తించిన పోలీసులు తక్షణమే స్పందించి ఆ ఇళ్లలోని కుటుంబాలను సురక్షితంగా బంధువుల ఇళ్లకు తరలించారు. కొప్పాక ఏలూరు కాలువ వద్ద ఒక చెట్టు విద్యుత్ తీగలపై కూలిపోయింది. ప్రస్తుతం ఏలూరు కాలువ గరిష్ట నీటిమట్టంతో ప్రవహిస్తుండటంతో, విద్యుత్ శాఖ, జీవీఎంసీ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, చెట్టును తొలగించే పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, కాలువలు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు