తిరుపతిలో హైటెన్షన్.. చెవిరెడ్డి కుటుంబం అరెస్ట్! కలెక్టరేట్ వద్ద నిరసన.. పోలీస్‌స్టేషన్‌లోనూ ఆందోళన
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు తిరుపతిలో ఉద్రిక్తతకు దారితీశాయి. నామినేషన్లు దాఖలు చేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, పలుచోట్ల దాడులు జరిగాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు తిరుపతి కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన తీవ్ర ఉత్కంఠ రేపింది. నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు బుధవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. జాతీయ జెండాలు, అంబేడ్కర్ చిత్రపటాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ బైఠాయించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద జరిగిన దాడుల్లో గాయపడిన అభ్యర్థులతో కలిసి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సుమారు ఆరు గంటల పాటు నిరసన కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన సతీమణి చెవిరెడ్డి లక్ష్మితో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. బాధిత అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు.
పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తున్నారు!
ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల సమక్షంలోనే కిరాయి వ్యక్తులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ కేంద్రం లోపల చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులను బెదిరించారని పేర్కొన్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని బయటపెడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కును అడ్డుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు, దాడులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ నుంచి పోలీస్‌స్టేషన్‌కు..
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలెక్టరేట్‌కు చేరుకున్న కొద్దిసేపటికే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు నిరసనలో పాల్గొన్న పలువురు అభ్యర్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. దీంతో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు, ఎంపీటీసీ అభ్యర్థులు పోలీస్‌స్టేషన్‌లో నేలపై కూర్చుని నిరసన కొనసాగించారు. కూటమి ప్రభుత్వ తీరును, పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
పోలీస్‌స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ శ్రేణులు
చెవిరెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వారికి సంఘీభావం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మొదలైన వివాదం, నేతల నిరసన, పోలీసుల చర్యలతో తిరుపతిలో రాజకీయంగా వేడిని పెంచింది.
H. Dwaraka, staff reporter, tpt.
Cell no : 9705347341