పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ
దేవరుప్పుల , మేజర్ న్యూస్, దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తవాడలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ప్రత్యేక చొరవ చూపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తవాడలోని ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గంలో మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న డ్రైనేజీకి ప్రత్యేక పైపులు వేయడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఏడో వార్డు సభ్యుడు చిలుకూరి నరసయ్య సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్పంచ్ వెంటనే సంబంధిత అధికారులకు సమస్యను తెలియజేసి, పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఏడో వార్డు సభ్యుడు చిలుకూరి నరసయ్య, కోలుకొండ వెంకన్న ఇళ్ల సమీపంలో నిలిచిపోయిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు, భీమయ్య ఇంటి వద్ద దెబ్బతిన్న డ్రైనేజీ ర్యాంపు పనులను పూర్తి చేశారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఊరట లభించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సకాలంలో స్పందించి పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, ఏడో వార్డు సభ్యుడు చిలుకూరి నరసయ్యకు గ్రామ ప్రజలు, కొత్తవాడ కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
రిపోర్టర్ ;ఎల్లేష్ ,దేవరుప్పుల, జనగామ జిల్లా