సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు
గ్రామంలో వైభవంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు
భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికిన భక్తులు
కేశంపేట మండల పరిధిలోని సంగెం గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో వెలసిన అమ్మవారి నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ జరిగాయి. గత తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలందుకున్న జగన్మాతను సాగనంపేందుకు గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. కన్నులపండువగా శోభాయాత్ర:
మండపంలో అమ్మవారికి ప్రత్యేక ముగింపు పూజలు, హారతులు నిర్వహించిన అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించిన వాహనంపై అమ్మవారిని ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించారు. ఈ శోభాయాత్ర పొడవునా భక్తులు కర్పూర నీరాజనాలు పడుతూ, జై మాతాజీ అంటూ చేసిన జయజయధ్వానాలతో సంగెం గ్రామం మారుమోగిపోయింది.
ఆడపడుచుల బతుకమ్మ ఆటలు.. యువత కోలాటాలు:
ఈ వేడుకల్లో గ్రామ ఆడపడుచులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన మహిళలు, యువరక్తం ఉరకలేసేలా యువత అమ్మవారి వాహనం ముందు నిలిచి బతుకమ్మ ఆటలు ఆడారు. చప్పట్లు, పాటల చరణాలతో సాగిన కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు వాయిద్యాలు, తీన్మార్ స్టెప్పులతో యువత సందడి చేయడంతో నిమజ్జన మహోత్సవం పండుగ వాతావరణాన్ని తలపించింది.
గ్రామస్తులందరూ ఎలాంటి విభేదాలు లేకుండా, ఒకే తాటిపైకి వచ్చి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేశారు. అమ్మవారి కృపాకటాక్షాలు సంగెం గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఈ సందర్భంగా పెద్దలు ఆకాంక్షించారు. నిమజ్జనం వేడుకల సందర్భంగా అమ్మవారి విగ్రహం సమక్షంలో ఆడపడుచుందరు బతుకమ్మ, కోలాటాలు , యువతీ యువకులు అమ్మవారి భజన కార్యక్రమాలతో వేడుకలను హొరెత్తించారు..