టీ.నరసాపురం ఎస్‌ఐ జయబాబు సేవలు భేష్ కౌన్సెలింగ్‌తో సమస్యల పరిష్కారం.. యువతకు మార్గనిర్దేశం
టీ.నరసాపురం మేజర్ న్యూస్: మండలంలో సబ్ ఇన్‌స్పెక్టర్ జయబాబు అందిస్తున్న సేవలకు గ్రామస్తుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో తరచూ భూ సంబంధిత వివాదాలు, తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఇరుపక్షాలను పిలిపించి సమస్యను పూర్తిగా తెలుసుకుని, చట్టపరమైన అంశాలను వివరించడంతో పాటు కౌన్సెలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ఎస్‌ఐ జయబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయంగా ఉందని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు.ఆయన సూచనలు, కౌన్సెలింగ్ వల్ల పలువురు ఇరుపక్షాలు రాజీకి వచ్చి, కేసుల వరకు వెళ్లకుండా తమ తమ పనులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారని చెబుతున్నారు. అదే విధంగా యువతకు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి మార్గంలో నడవాలని సూచిస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు.టీ.నరసాపురం మండలానికి ఇప్పటివరకు పలువురు పోలీసు అధికారులు సేవలందించినప్పటికీ, ప్రస్తుతం ఎస్‌ఐ జయబాబు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ ప్రత్యేకంగా నిలుస్తోందని గ్రామస్తులు అంటున్నారు. పోలీస్ శాఖకు, మండలానికి మంచి పేరు వచ్చేలా సేవలందిస్తున్న ఎస్‌ఐ జయబాబును పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు.