తాళ్లమాపురానికి రూ.3.50 కోట్ల నిధులు మంజూరు పై జనసేన నాయకుల హర్షం
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : తమ గ్రామ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని జనసేన నాయకులు జి.వి. రమణ, మంచి శివకుమార్ తెలిపారు. తాళ్లమాపురం గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సోమవారం ప్రొద్దుటూరు లో జరిగిన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాళ్లమాపురం గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. మాధవ్, మంత్రులు, కూటమి నాయకులు హాజరయ్యారని ఇందులో తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలిపామని వెంటనే మూడున్నర కోట్లు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తాళ్లమాపురం గ్రామంలో 2019–24 మధ్య అభివృద్ధి పనులు జరగలేదని, గ్రామ సమస్యలను ఆధారాలతో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు జి.వి. రమణ తెలిపారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించి రూ.1.50 కోట్లతో సీసీ రోడ్లు, రూ.2 కోట్లతో తాగునీటి పనులకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. గ్రామ యువత తమ సమస్యలను ధైర్యంగా ముందుకు తీసుకురావడాన్ని ఆయన అభినందించారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కూటమి, జనసేన బలంపై కులాన్ని ప్రస్తావిస్తూ జనసేన నాయకులను విమర్శించడం సరికాదన్నారు. తాళ్లమాపురంలో అన్ని కులాలు, వర్గాల ప్రజలు ఐకమత్యంగా ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని అన్నారు. సనాతన ధర్మం అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవించడమేనని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను ఏకవచనంతో సంబోధించడం తగదని హితవు పలికారు. తాళ్లమాపురాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. గ్రామస్థులు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. అనంతరం జి.వి. రమణ ఆధ్వర్యంలో గ్రామస్థులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా