జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం
సూర్య అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పొతాయిలంక గ్రామానికి చెందిన గెద్దాడ సాహితి తేజ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఆమె ఈ స్వర్ణ పతకం సాధించిందని జిల్లా తైక్వాండో కోచ్, అసోసియేషన్ సెక్రటరీ పి. త్రిమూర్తులు బుధవారం అధికారికంగా వెల్లడించారు.
జాతీయ వేదికపై సత్తా చాటి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన సాహితి తేజ ప్రస్తుతం గెద్దాడ ఎడ్యుకేర్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తోంది. చదువుతో పాటు క్రీడారంగంలో కూడా పట్టుదలతో సాధన చేసి ఈ ఘనత సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
స్వర్ణ పతకంతో మెరిసిన విద్యార్థిని సాహితి తేజను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, కోచ్‌లు పి. ఆదిత్య, పి. భార్గవిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.