పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ : చేతులు, కాళ్లు కట్టేసి దాడి.. బంగారం, నగదు అపహరణ
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండల కేంద్రంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు చొరబడి దోపిడీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అక్టోబర్ 7వ తేదీ అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.పెరవలి గ్రామానికి చెందిన గుడివాడ సత్యశ్రీ తన భర్త మృతి అనంతరం సొంత ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ, బంగారం తాకట్టు పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటి వెనుక తలుపును పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ముఖాలకు మాస్కులు ధరించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమె నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమెను పట్టుకుని చేతులు, కాళ్లను గుడ్డలతో కట్టివేశారు. అనంతరం ఆమె నోటిలో గుడ్డలు కుక్కి, గుర్తుతెలియని వస్తువుతో తల, ముఖం, భుజంపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ఆ తర్వాత వారిలో ఒకరు బాధితురాలిని అదుపులో ఉంచగా, మరొకరు బీరువాలోని లాకర్లను తెరిచి బంగారు ఆభరణాలను తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వడ్డీ వ్యాపారం నిమిత్తం ఇతరులు తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మరో గదిలోని ఇనుప బీరువాను తెరిచి సుమారు రూ.2 లక్షల నగదును అపహరించినట్లు తెలిపింది.
చివరగా ఇద్దరూ కలిసి బాధితురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనలో బాధితురాలి వద్ద ఉన్న సుమారు 15 కాసుల బంగారంతో పాటు, తాకట్టు వ్యాపారానికి సంబంధించిన బంగారం, నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. తాకట్టు పెట్టిన బంగారం ఖచ్చితమైన పరిమాణం, విలువ ప్రస్తుతం తెలియరాలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.సంఘటన అనంతరం బాధితురాలు తన అల్లుడికి సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సిబ్బంది సంఘటనా స్థలంలో ఆధారాల కోసం పరిశీలన చేపట్టారు.తాకట్టు లావాదేవీల పుస్తకంపై ఆరా తీయాలని విజ్ఞప్తిఇ
దిలా ఉండగా, సంఘటనా స్థలంలో క్లూస్ టీం పోలీసులు ఆధారాల కోసం పరిశీలిస్తున్న సమయంలో బాధితురాలి తాకట్టు వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల పుస్తకం ఒకటి లభించిందని, దానిని పోలీసులు తీసుకెళ్లినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు.ఆ పుస్తకానికి ఈ దోపిడీ ఘటనతో ఏమైనా సంబంధం ఉందా? తాకట్టు పెట్టిన బంగారం వివరాలు, దాని యజమానులు, లావాదేవీలకు సంబంధించిన సమాచారం దోపిడీకి సంబంధించి ఏదైనా ఆధారాన్ని అందిస్తుందా? అనే కోణంలో పోలీసులు సమగ్రంగా విచారణ జరపాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.అయితే తాకట్టు లావాదేవీల పుస్తకానికి దోపిడీ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదు. ఈ అంశం దర్యాప్తులో తేలాల్సి ఉంది. దోపిడీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించి, అపహరించబడిన బంగారం, నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.