స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులను వేలం వేయడం చట్టరీత్యా నేరం* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, అక్టోబర్ 16:- స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవుల వేలం వేయడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఎన్నికలలో మేయర్, ఛైర్పర్సన్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం, ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమంగా ఏకగ్రీవం చేయడం వంటి చర్యలు చట్టవ్యతిరేకమైన చర్య మరియు అవినీతి ప్రక్రియ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని కలెక్టర్ తెలిపారు.
పదవులను వేలం వేయడం మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 17(1), ఎ.పి. మునిసిపాలిటీల చట్టం 1965లోని సెక్షన్ 343-A(1) మరియు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 లోని సెక్షన్ 170, 173 ల ప్రకారం తీవ్రమైన నేరమన్నారు. ఎన్నికల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే, తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.